Saturday, November 23, 2024

ఎకో ఫ్రెండ్లీగా కాకతీయ టెక్స్‌టైల్‌ పార్క్.. భారీ సామర్థ్యంతో కామన్‌ ఎఫ్లూయెంట్‌ ప్లాంట్‌ నిర్మాణం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం వరంగల్‌లో ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్న కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు(కేఎంపీటీ)ని పర్యావరణహితంగా మార్చడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఈ టెెక్స్‌టైల్‌ పార్కులో పెట్టుబడులు పెట్టే కంపెనీల కోసం సకల మౌళిక సదుపాయాలు కల్పించిన ప్రభుత్వం తాజాగా పార్కులో ఉత్పత్తయ్యే వ్యర్థాల శుద్ధికి భారీ ఎఫ్లూయెంట్‌ ప్లాంట్‌ నిర్మించేందుకు నిర్ణయించింది. ఈ కామన్‌ ఎఫ్లూయెంట్‌ నిర్మాణానికిగాను తెలంగాణ పారిశ్రామిక మౌళిక సదుపాయాల సంస్థ(టీఎస్‌ఐఐసీ) టెండర్లు పిలిచింది. ఆగస్టు నెలాఖరు వరకు టెండర్లు దాఖలు చేయడానికి తుది గడువుగా ప్రకటించింది. ఈలోపు ఆసక్తి ఉన్న బిడ్డర్లతో ప్రీబిడ్‌ సమావేశం నిర్వహించి వారి సందేహాలను నివృత్తి చేస్తామని తెలిపింది.

రోజుకు 5 మిలియన్‌ లీటర్ల ద్రవ వ్యర్థాల శుద్ధి…

మెగా టెక్స్‌టౖౖెల్‌ పార్కులోని భారీ పరిశ్రమల నుంచి వెలువడే రసాయన, ఇతర ద్రవ వ్యర్థాలు వరంగల్‌ జిల్లాల్లోని జలవనరులను కలుషితం చేయకుండా ఉండేందుకుగాను ట్రీట్‌మెంట్‌ ప్లాంటు నిర్మించనున్నారు. భారీ పరిశ్రమల నుంచి వెలువడే ద్రవ వ్యర్థాలను శుద్ధి చేసేందుకుగాను భారీ స్థాయిలో రోజుకు 5 మిలియన్‌ లీటర్ల వ్యర్థాల శుద్ధి చేసే విధంగా ప్లాంటును టీఎస్‌ఐఐసీ నిర్మించనుంది. దీంతో మెగా టెక్స్‌టైల్‌ పార్కు నుంచి ఒక్క చుక్క కూడా ద్రవ వ్యర్థం కూడా బయటకు రాకుండా ఈ ప్లాంటు ఉపయోగపడుతుందని టీఎస్‌ఐఐసీ తెలిపింది. జీరో లిక్విడ్‌ పద్ధతిలో మెగా టెక్స్‌టైల్‌ పార్కను పూర్తి పర్యావరణ హితంగా అభివృద్ధి చేస్తున్నట్లు టీఎస్‌ఐఐసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

ప్లాంటు ఖర్చు ఈక్విటీ రూపంలో పెట్టుబడి పెట్టనున్న కంపెనీలు…

మెగా టెక్స్‌టైల్‌ పార్కులో ఏర్పాటు చేయనున్న ద్రవ వ్యర్థాల ప్లాంటుకు అవసరమైన పెట్టుబడిని పార్కులో పరిశ్రమలు నెలకొల్పిన కంపెనీలే ఈక్విటీ రూపంలో పెడతాయని టీఎస్‌ఐఐసీ తెలిపింది. బిడ్డింగ్‌లో ఎంపికైన కంపెనీ ప్లాంటును నిర్మించడమే కాకుండా 7 సంవత్సరాల పాటు దాని నిర్వహణకూడా చూడాల్సి ఉంటుందని టీఎస్‌ఐఐసీ అధికారులు చెబుతున్నారు. అయితే ప్లాంటు నిర్మాణానికి అయ్యే ఖర్చులో ఎక్కువ మొత్తాన్ని కేంద్రప్రభుత్వ టెక్స్‌టైల్‌ మంత్రిత్వ శాఖ నుంచి సబ్సిడీ రూపంలో పొందే వెసులుబాటు ఉందని టెండరులో టీఎస్‌ఐఐసీ స్పష్టం చేసింది.

- Advertisement -

పార్కులో ఇప్పటికే ఫుల్‌ ఆక్యుపెన్సీ…

ఫామ్‌ టు ఫ్యాషన్‌ ట్యాగ్‌లైన్‌తో ఇంటిగ్రేటెడ్‌ పద్ధతిలో టెక్స్‌టైల్‌ పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే విధంగా ప్రభుత్వం అభివృద్ధి చేసిన కాకతీయ మెగా టెెక్స్‌టైల్‌ పార్కులో స్థలాలకు టెక్స్‌టైల్‌ కంపెనీల నుంచి భారీ డిమాండ్‌ ఉంది. ఇప్పటికే పార్కులోని 60 శాతం ప్లాట్లను టీఎస్‌ఐఐసీ పలు కంపెనీలకు కేటాయించింది. కిటెక్స్‌ లాంటి బహుళజాతి వస్త్ర తయారీ కంపెనీ ఏకంగా రూ.1000 కోట్లతో ఇక్కడ కిడ్స్‌ వేర్‌ తయారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. కిటెక్స్‌ కాకుండా పలు ఇతర టెక్స్‌టైల్‌ కంపెనీలు కూడా ఇప్పటికే వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు ప్రకటించాయి. కరోనాతో ఆగిపోయిన ఈ కంపెనీలకు చెందిన వస్త్ర తయారీ పరిశ్రమల నిర్మాణం ఇటీవలి కాలంలో ఊపందుకోవడంతో త్వరలో వరంగల్‌ టెక్స్‌టైల్‌ మారే పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు పేర్కొంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement