హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్యాసింజర్ కోచ్‌ల నిర్వహణ కార్యకలాపాలను సులభతరం చేయడానికి ప్రధాన రైల్వే స్టేషన్లలో కోచ్ నిర్వహణ డిపోల నిర్మాణాన్ని చేపట్టినట్లు ద.మ.రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. శుక్రవారం సికింద్రబాద్ రైల్వే స్టేషన్ వద్ద అభివృద్ధి పరచిన రైల్వే కోచ్‌ల నిర్వహణ సదుపాయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద.మ.రైల్వే పరిధిలోని ప్రధాన జంక్షన్ స్టేషన్‌లలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఒకటనీ, ఈ స్టేషన్ నుంచి ప్రతీ రోజు అనేక ప్యాసింజర్ రైళ్లు ఇతర స్టేషన్లకు, ఇతర స్టేషన్ల నుంచి ఈ స్టేషన్‌కు చేరుకుంటాయని తెలిపారు.
గతంలో స్టేషన్‌లోని వాషింగ్ సైడ్ వద్ద పిట్‌లైన్ అధునిక అవసరాలకు అనుగుణంగా లేకపోవడం వల్ల రేక్ నిర్వహణలో లోపాలు ఉండేవనీ, దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్యాసింజర్ రైళ్లను సమర్థవంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు గాను సుమారు రూ.17 కోట్ల వ్యయంతో కోచ్ నిర్వహణ సౌకర్యం అభివృద్ధి చెందిందని చెప్పారు. ఈ డిపోలో కోచింగ్ రైళ్ల ప్రాథమిక నిర్వహణ సమయంలో రేక్‌ను క్షుణ్నంగా పరీక్షించేందుకు వీలుగా సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ మెయింటెనెన్స్ టెక్నాలజీ డిజైన్‌ల ప్రకారం వాషింగ్ సైడ్-2 వద్ద కోచ్ నిర్వహణ సౌకర్యం అప్‌గ్రేడ్ చేయబడిందన్నారు.
ఈ సదుపాయం వల్ల ఒకేసారి 26 కోచ్‌ల నిర్వహణకు వీలు కలుగుతున్నదనీ, దీంతో పాటు ప్యాసింజర్ కోచ్‌ల సమర్థవంతమైన సరైన నిర్వహణకు నిర్ధారించడానికి పిట్‌లైన్ వద్ద సరైన లైటింగ్, డ్రైనేజీ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కోచ్ మెయింటెనెన్స్ సదుపాయాన్ని అభివృద్ధి చేసినందుకు సికింద్రాబాద్ డివిజన్ బృందాన్ని అభినందించారు. దీనివల్ల పిట్‌లైన్ సౌకర్యం కోచ్‌ల నిర్వహణకు అత్యున్నత ప్రమాణాలను నిర్దారిస్తుందనీ, ప్యాసింజర్ రైలు సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి వీలు కలుగుతుందని ఈ సందర్భంగా ద.మ.రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు.