Wednesday, November 20, 2024

3 వేల కోట్లతో భావనపాడు షిప్పింగ్‌ హార్బర్‌ నిర్మాణం

శ్రీకాకుళం, ప్రభన్యూస్‌ బ్యూరో : శ్రీకాకుళం జిల్లా ప్రజలు, మత్స్యకారులు దాదాపు మూడున్నర దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న భావనపాడు షిప్పింగ్‌ హార్బర్‌ ఎట్టకేలకు నిర్మాణానికి నోచుకోబోతోంది. జిల్లాలోని సంతబొమ్మాళి మండలం భావనపాడు వద్ద షిప్పింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి పలుమార్లు ఆ ప్రాంతంలో వివిధ కంపెనీలు పరిశీలన చేశాయి. 1996లో అప్పటి చంద్రబాబునాయుడు ప్రభుత్వం కూడా భావనపాడు హార్బర్‌ నిర్మాణానికి జర్మన్‌ కంపెనీతో పరిశీలన చేయించారు. అయితే అప్పట్లో అక్కడ షిప్పింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి ఆప్రాంతం అనువుగా లేదని చెప్పడంతో తరువాత కొంత కాలం భావనపాడు హార్బర్‌ నిర్మాణం మరుగున పడింది. వైఎస్‌ రాజశేఖరెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా దీనిపై చర్చలు జరిగినప్పటికీ కార్యరూపం దాల్చలేదు.

దీంతో భావనపాడు హార్బర్‌ నిర్మాణం అనేది ఎన్నికల హామీగా మాత్రమే ఉండిపోయిందనే విమర్శలు కూడా ప్రజలనుంచి వినిపించాయి. 2014లో చంద్రబాబునాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లి ఈ భావనపాడు హార్బర్‌ నిర్మాణానికి నడుం బిగించడం జరిగింది. అప్పట్లో తొలుత 6 వేల ఎకరాలలో దీనిని నిర్మించాలని నిర్ణయించినప్పటికీ, తరువాత పలుమార్లు పరిశీలనలు, మ్యాప్‌లు తయారు చేసిన తరువాత 2,200 ఎకరాలలో దీనిని నిర్మించడానికి అదానీ కంపెనీకే దీనిని అప్పగించాలని కూడా నిర్ణయించారు. దీనిపై అప్పట్లో మర్రిపాడు, భావనపాడు, సీతానగరం, శెలగపేట గ్రామాల్లో భూసేకరణ కూడా చేపట్టారు. అయితే నిర్మాణ పనులు మాత్రం ప్రారంభించలేదు. 2019 ఎన్నికలలో టీడీపీ ప్రభుత్వం అధికారం కోల్పోవడం, వైసీపీ ప్రభుత్వం రావడం జరిగింది. కరోనా కారణంగా తొలి మూడు సంవత్సరాలు దీనిపై వైసీపీ ప్రభుత్వం కూడా పట్టించుకునే పరిస్థితి లేకపోయింది.

- Advertisement -

అయితే తరువాత ఈ హార్బర్‌ నిర్మాణాన్ని భావనపాడుకు బదులు అదే మండలంలోని విష్ణుచక్రపురం, రాజపురం, మూలపేట గ్రామాలలో భూసేకరణ చేసి నిర్మించడానికి, ఇందుకోసం గతంలో చెప్పిన విధంగా 2,200 ఎకరాలు కాకుండా కేవలం 650 ఎకరాలలోనే దీనిని నిర్మించడానికి నిర్ణయించారు. దాదాపు 3 వేల కోట్ల రూపాయలతో దీనిని నిర్మించేందుకు అదానీ కంపెనీకి దీనిని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఇప్పటికే ఆ మేరకు భూసేకరణ పూర్తిచేసి, రైతులకు ఎకరానికి రూ. 25 లక్షల చొప్పున పరిహారం చెల్లించే చర్యలు కూడా పూర్తిచేసింది. దీంతో భావనపాడు షిపింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి అన్ని అండంకులు దాదాపు తొలగిపోవడంతో ఈ నెల 19న ఈ హార్బర్‌ నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి చేతులమీదుగా శంకుస్థాపన చేసేందుకు కూడా ముహూర్తం నిర్ణయించారు. నిర్వాసితులకు మూలపేట వద్ద పునరావాస కాలనీ నిర్మించేందుకు కూడా చర్యలు చేపట్టారు. దీంతో శ్రీకాకుళం జిల్లా ప్రజలు, మత్స్యకారులు మూడున్నర దశాబ్దాలుగా కలలు కంటున్న హార్బర్‌ నిర్మాణానికి నోచుకుంటోంది.

దీనిద్వారా జిల్లాలో పలు పరిశ్రమలకు సంబందించిన ఎగుమతులు, దిగుమతులు సులభతరమవడమే కాకుండా, మత్స్యకారులకు కూడా మత్స్యసంపదను ఇతర ప్రాంతాలకు పంపించుకునేందుకు వీలుంటుందని, ఈ ప్రాంతం నుంచి మత్స్యకారులు గుజరాత్‌, చెన్నై వంటి ప్రాంతాలకు వలస వెళ్లకుండా ఈ ప్రాంతంలోనే చేపలవేట చేసుకుని, ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతం వాణిజ్యపరంగా బాగా అభివృధ్ధి చెందడం వల్ల జిల్లాకు ఆదాయం కూడా భారీగా సమకూరుతుందని, పోర్టు నిర్మాణం కారణంగా వందలాది మందికి ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని అధికారులు తెలియచేస్తున్నారు. ఎన్నికల సంవత్సరంలో దీనిని శంకుస్థాపన చేస్తున్న నేపథ్యంలో శంకుస్థాపనతోనే ఆగిపోకుండా దీనిని నిర్మాణ పనులు త్వరితగతిన జరిగేలా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాగం కృషి చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement