కోవిడ్ -19 కేసుల ఉధృతి పెరుగుతూండటంతో రాజధాని బీజింగ్ సహా అనేక నగరాల్లో లాక్‌డౌన్ విధించిన చైనా కఠినంగా అమలు చేస్తోంది. శుక్రవారంనుంచి అనేక నగరాల్లో కరోనా కేసులు నమోదవడంతో ఎక్కడికక్కడ లాక్‌డౌన్ విధించింది. ఒక్క బీజింగ్‌లోనే 1.76 కోట్లమంది ఇంటిపట్టునే ఉండాల్సిన పరిస్థితి. ఇక ఐటీ, ఫార్మా, పారిశ్రామిక నగరాలైన షాంఘై, షెన్‌షున్, షునియ, గువాంగ్‌డోంగ్, సిపింగ్, జిలిన్ ప్రావిన్స్ పరిథిలోని అనేక చిన్న చిన్న నగరాలు, దున్‌హువా వంటి ప్రాంతాల్లో కఠిన లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. రేషన్, మందులు ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నవారిని మూడురోజులుగా బయటకురానివ్వడం లేదు. లక్షలాదిమందికి ఇప్పటివరకు వరుసగా ఆరు రౌండ్ల కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. పారిశ్రామిక నగరం చుంగ్‌చున్‌లో 90 లక్షలమంది ఇల్లు దాటి బయటకు రాలేదు. అక్కడ అతి కఠినంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. చైనాలో గడచిన 24 గంటల్లో 2303 కొత్త కేసులు నమోదయ్యాయి. రెండేళ్లలో అత్యధికంగా ఆదివారంనాడు 3400 కు పైగా కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం చైనాలో వెలుగుచూస్తున్న కరోనా ఒమిక్రాన్ వేరియంటేనని, కొత్త వేరియంట్‌గా ఇంకా నిర్ధారణ కాలేదని తెలుస్తోంది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఏ ప్రకటనా చేయలేదు.
అతివేగంగా ఆస్పత్రుల నిర్మాణం..
కరోనాపై జీరో టోలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్న చైనా ఒక్క కేసు నమోదైనా లాక్‌డౌన్ విధిస్తోంది. ఈ నేపథ్యంలో జిలిన్ నగరంలో పెద్దసంఖ్యలో కేసులు నమోదవడంతో అప్రమత్తమైంది. లాక్‌డౌన్ విధించడంతోపాటు 6వేల పడకల తాత్కాలిక ఆస్పత్రిని కేవలం ఆరు రోజుల్లో నిర్మించింది. ఆదివారం నాడు జిలిన్ ప్రావిన్స్‌లో వెయ్యి కేసులు నమోదయ్యాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..