Monday, November 18, 2024

జూనియర్‌ కాలేజీల్లో గురుకులాలు.. ఒకే ప్రాంగణంలో పలు విద్యాసంస్థల నిర్మాణాలు..

ఇంటర్‌ విద్యాశాఖ విద్యార్థుల భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా అంచనా వేయకుండా ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల స్థళాలలను ఇతర ప్రభుత్వ సంస్థలకు ధారాదత్తం చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మైనారిటీ శాఖ అడిగిందే తడువుగా ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల ప్రాంగణాల్లోని ఖాళీ స్థలాల్లో మైనార్టీ గురుకుల జూనియర్‌ కాలేజీలు, మైనారిటీ హాస్టళ్లను నిర్మించుకునేందుకు వారికి ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ అధికారులు అనుమతులిచ్చారు. ఒకే ప్రాంగణంలో పలు విద్యా సంస్థలు నిర్మించి వాటిని అందుబాటులోకి తేవడం ద్వారా అక్కడ చదువుకునే విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని ఇంటర్‌ విద్యా జేఏసీ నాయకులు ఆరోపిస్తున్నారు.

అంతేకాకుండా ఉన్న స్థళాలన్నీ ఇతర శాఖలకు ఇచ్చేస్తే భవిష్యత్తులో ఆయా జూనియర్‌ కాలేజీలను విద్యా ర్థుల సంఖ్యకు అనుగుణంగా అభివృద్ధి చేయాలంటే ఖాళీ స్థలం దొరకని పరిస్థితి తలెత్తుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల జూనియర్‌ కాలేజీల ఖాళీ స్థలాల్లో ప్రభుత్వ పాఠశాలలు, డిగ్రీ కాలేజీలను నిర్మించారు. మైనారిటీ వెల్ఫేర్‌ అధికారులు గురుకులాలను ఎనిమిది చోట్ల నిర్మించేందుకుగానూ ఇంటర్‌ విద్యాశాఖకు ఇటీవల దరఖాస్తు చేసుకోగా అందులో మూడుచోట్ల అనుమతులిస్తూ స్థళాన్ని కేటాయించినట్లు తెలిసింది.

నాంపల్లిలోని ఎంఏఎం గర్ల్స్‌ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలోని ఖాళీ స్థలంలో ఒక సర్కారు మైనారిటీ జూనియర్‌ కాలేజీ, మైనారిటీ గర్ల్స్‌ హాస్టల్‌, ఫలక్‌నుమాలోని బాయ్స్‌ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ ప్రాంగణంలో జూనియర్‌ కాలేజీ, హాస్టల్‌ బిల్డింగ్‌ నిర్మాణానికి స్థలాలను కేటాయించారు. అదేవిధంగా బాజర్‌ఘట్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ స్థలంలో నూతనంగా మైనారిటీ గర్ల్స్‌ జూనియర్‌ కాలేజీ,గర్ల్స్‌ హాస్టల్‌ నిర్మించేందుకు ఇటీవల అధికారులు అనుమ తులు జారీ చేశారు. ఇందుకుగానూ నాంపల్లి కాలేజీలో11.12 గుంటాల స్థలం, ఫలక్‌నుమా కాలేజీలో 12.39 గుంటాల స్థలం, బాజర్‌ఘట్‌లో 0.25 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. భవిష్యత్‌ అవసరాలను అంచనా వేయకుండా ఇలా ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలను ఇతర ప్రభుత్వ శాఖలకు కట్టబెడితే ఎలా అని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. అధికారులు మాత్రం ప్రభుత్వ స్థలాలను ప్రభుత్వ సంస్థలకు ఇస్తే తప్పేముందని బదులిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement