Tuesday, November 26, 2024

అంతా అమెరికావల్లే మా ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర : ఇమ్రాన్‌ ఖాన్

ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన తన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు విదేశీ శక్తులు కుట్ర చేశాయని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఆరోపించారు. విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో గురువారం రాత్రి పొద్దుపోయాక ఆయన జాతీయ అసెంబ్లిలో మాట్లాడుతూ అమెరికావైపు వేలెత్తిచూపేలా పరోక్ష విమర్శలు చేశారు. మధ్యలో అమెరికా పేరును ఉచ్చరిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. తన ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించేలా వ్యవహరించాలని ఒత్తిడి చేస్తూ లేఖలు పంపిందని ఆరోపించారు. ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో తాను రష్యా పర్యటించడాన్ని బైడెన్‌ ప్రభుత్వం ఇష్టపడలేదని పరోక్షంగా ప్రస్తావించారు. స్వతంత్ర విదేశాంగ విధానంతో తాను అడుగులువేయడాన్ని భారత్‌ అనుకూల అగ్రరాజ్యం సహించలేక తన ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. కాగా పాకిస్తాన్‌ ఆరోపణలను అమెరికా తోసిపుచ్చింది. అక్కడి ప్రభుత్వాన్ని కూలదోయాల్సిన అవసరం లేదని, అక్కడి చట్టసభ సభ్యులకు ఎటువంట బెదరింపు లేఖలు పంపలేదని స్పష్టం చేసింది. అయినా పాకిస్తాన్‌లో పరిణామాలను గమనిస్తున్నామని, ఇంతకుమించి మాట్లాడాల్సిన అవసరమే లేదని కుండబద్దలు కొట్టింది. కాగా ఇమ్రాన్‌ ప్రభుత్వం పతనానికి అంచున ఉంది. ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాలు మద్దతు ఉపసంహరించడం, ఆ పార్టీలకు చెందిన మంత్రులు రాజీనామా చేయడం, ఇమ్రాన్‌ సొంతపార్టీలోని 24మంది సభ్యులు వ్యతిరేక కూటమిలో చేరడంవంటి పరిణామాల నేపథ్యంలో ఇమ్రాన్‌ రాజీనామా చేస్తారని అందరూ భావిస్తున్నారు. కానీ గురువారం జాతీయ అసెంబ్లిలో మాట్లాడిన ఆయన చివరి వరకు పోరాడతానేగానీ రాజీనామా చేసే ప్రసక్తే లేదని అన్నారు. విపక్షాల అవిశ్వాస తీర్మానం వెనక్కు తీసుకుంటే జాతీయ అసెంబ్లిలో రద్దు చేసి ఎన్నికలకు వెడదామని ఓ ప్రకటన చేశారు. కాగా ఇమ్రాన్‌ ఆఫర్‌ను విపక్షాలు తిరస్కరించాయి. ఆదివారంనాడు అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ జరగనుంది.

అమెరికా దౌత్యవేత్తకు పాక్‌ సమన్లు..

ఒకవైపు అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు సమయం దగ్గరపడుతుండగా అమెరికాను విదేశీబూచిగా చూపిన పాకిస్తాన్‌లోని ఇమ్రాన్‌ ప్రభుత్వం తన ఆరోపణలకు అనుగుణంగానే అడుగులు వేస్తోంది. పాకిస్తాన్‌లోని అమెరికా దౌత్యవేత్తకు శుక్రవారం సమన్లు జారీ చేసిందని ప్రముఖ వార్తాసంస్థలు పేర్కొన్నాయి. పాకిస్తాన్‌ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోవడాన్ని తప్పుబట్టింది. చట్టసభ సభ్యులను బెదరిస్తూ లేఖలు రాయడాన్ని ఖండించింది. దానిపై వివరణ ఇవ్వాలని కోరింది. అమెరికావైఖరిపట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement