Monday, November 18, 2024

మతం పేరుతో చిచ్చు రేపే కుట్ర.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : దోవల్‌..

మతం పేరుతోను, సిద్ధాంతాల పేరుతోను ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు కొన్నివర్గాలు ప్రయత్నిస్తున్నాయని, తద్వారా శాంతిసామరస్యాలను దెబ్బతీసి అశాంతి రేపాలని భావిస్తున్నారని, అలాంటి ప్రయత్నాలను ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తిప్పికొట్టాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ పిలుపునిచ్చారు. న్యూఢిల్లిలో ఈ రోజు (శనివారం) జరిగిన ఆల్‌ ఇండియా సూఫి సజ్జదనశిన్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శాంతి, ఐక్యత, దేశంలో తాజా పరిణామాలపై చర్చించేందుకు మతపెద్దలు పాల్గొన్న ఈ సమావేశానికి అజిత్‌ దోవల్‌ హాజరైనారు. భారత్‌ అభివృద్ధి చెందడాన్ని చూసి భరించలేని కొన్ని శక్తులు ఈ కుట్రకు తెరతీశాయన్న ఆయన మతం, సిద్ధాంతం పేరుతో ఇంటాబయటా విషం కక్కుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్న పాపుల్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా వంటి సంస్థలను నిషేధించాలని కోరుతూ ఈ సమావేశం తీర్మానం చేసింది.బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్‌ శర్మను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన రెండు నెలల తరువాత దోవల్‌ కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మహమ్మద్‌ ప్రవక్తపై ఆమె చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో దేశవిదేశాల్లో తీవ్ర వ్యతిరేకత వెల్లడైన విషయం తెలిసిందే. ఆ తరువాత రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఒక టైలర్‌ను మరో వర్గానికి చెందిన వారు హత్య చేయడం వంటి పరిణామాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. కాగా ఐక్య, వైవిధ్యంలో భారత్‌ కీర్తిప్రతిష్టలను దెబ్బతీసేందుకు కొన్ని సంఘ విద్రోహ శక్తులు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని సమావేశం కోరింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement