న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : అగ్నిపథ్ పథకంపై ఉద్దేశపూర్వకంగానే యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో హింసాత్మక ఘటనలను ఆయన ఖండించారు. శుక్రవారం మధ్యాహ్నం న్యూఢిల్లీలోని తన నివాసంలో ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావుతో కలిసి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. పథకం ప్రకారమే కుట్ర చేసి విధ్వంసం సృష్టించారని అనుమానం వ్యక్తం చేశారు. యువతలో దేశభక్తి, జాతీయ వాదాన్ని పెంచేందుకు అగ్నిపథ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని చెప్పారు. చిన్ననాటి నుంచే చాలా మంది ఆర్మీలోకి వెళ్లాలని కలలు కంటారన్న ఆయన, ఈ పథకంలో స్వచ్ఛందంగా ఇష్టపడ్డ వారే చేరవచ్చని తేల్చి చెప్పారు. ఇజ్రాయిల్‌లో తప్పనిసరిగా యువతీ యువకులు ఆర్మీలో పని చేయాలనే నిబంధన ఉందని, అనేక దేశాల్లో అగ్నిపథ్ వంటి పధకాలు ఉన్నాయని కిషన్‌రెడ్డి వివరించారు. బ్రెజిల్‌లో 18 సంవత్సరాలు దాటిన వారు 12 నెలలు, ఇరాన్‌లో 20 నెలలు, ఉత్తర కొరియాలో 17 ఏళ్ళు నిండిన వారు ఆర్మీలో పని చేయాలనే నిబంధన ఉందని… అలాగే సౌత్ కొరియా, మెక్సికో, యూఏఈ, సింగపూర్, స్విట్జర్లాండ్, టర్కీ, గ్రీస్‌లో తప్పనిసరిగా ఆర్మీలో పని చేయాలని తెలిపారు. కానీ భారత్‌లో మాత్రం ఇష్టం ఉన్న వారే సైన్యంలో చేరేలా అగ్నిపథ్ పథకాన్ని రూపొందించామన్నారు. అగ్నిపథ్ కింద సైన్యంలో పని చేసిన వారు కేంద్ర, రాష్ట్ర ఉద్యోగాల్లో చేరవచ్చని, అగ్నిపథ్ వీరులకు నాలుగేళ్ళ పాటు వృత్తి నైపుణ్యం అందిస్తారని వెల్లడించారు. అనేకమందికి ఉద్యోగవకాశాలు కల్పించేలా పథకాన్ని భారత ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. కొందరు దురుద్దేశంతో అగ్నిపథ్ పథకంపై అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు. నరేంద్ర మోదీ ప్రధాని కాకముందు నుంచే సైనిక సంస్కరణలపై చర్చ జరుగుతోందని చెప్పిన ఆయన, అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకునే అగ్నిపథ్ పధకం తీసుకువచ్చామని తెలిపారు. దేశ సేవ కోసం, దేశానికి యుద్ద సమయంలో ఉపయోగపడేలా తీసుకొచ్చిన స్వచ్చంద పథకంపై కుట్ర చేయడం దురదృష్టకరమని కేంద్రమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసులు, ప్రభుత్వానిదే బాధ్యత..
ప్రయాణికులు భయాందోళనలతో పరుగులు పెట్టినా తెలంగాణ పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. 40 మోటార్ సైకిళ్ళు కాల్చేశారని, షాపులు ధ్వంసం చేస్తున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని మండిపడ్డారు. సికింద్రాబాద్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సమస్య ఉంటే భారత ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని, ప్రజాస్వామ్య దేశంలో హింస మంచిది కాదని హితవు పలికారు. ఆందోళనకారులు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. దేశంలో మరెక్కడా గొడవలు జరగకూడదని ఆయన ఆకాంక్షించారు. రైల్వేస్టేషన్‌లో గొడవ జరుగుతుందని తెలిసినా పోలీసులు సకాలంలో అక్కడికి చేరుకోలేదని విమర్శించారు. అల్లర్లు ఎందుకు జరిగాయో పోలీసులు దర్యాప్తు జరపాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇతర ప్రాంతాల్లో ధర్నాలు జరిగితే అరెస్టులు చేసి ముందు జాగ్రత్త చర్యలు చేపడతారు, అలాంటిది ఇప్పుడింత హింసాత్మక ఘటనలు ఎలా జరిగాయని ఆయన సందేహం వ్యక్తం చేశారు. రైళ్లు తగలబెడితే సమస్య పరిష్కరమవుతుందాని ప్రశ్నించారు. బిపిన్ రావత్ ఆర్మీ చీఫ్‌గా ఉన్నపుడే ఈ అంశంపై చర్చ జరిగిందని వెల్లడించిన కిషన్‌రెడ్డి, కేంద్రం ఏకపక్ష నిర్ణయం తీసుకోలేదని, అనేక కమిటీలు వేసి, విదేశీ పర్యటనలు చేసి అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. యువతలో నైపుణ్యం, దేశభక్తి పెంచాలనుకున్నారే తప్ప అన్యాయం చేయాలని కేంద్రం భావించలేదని వ్యాఖ్యానించారు. పెన్షన్ మిగుల్చుకోవడానికి అగ్నిపథ్ పథకం తెచ్చారనడం అపోహ మాత్రమేనని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.
రాజకీయ ప్రమేయం..
కేంద్ర ప్రభుత్వం ఏ పథకం తెచ్చినా ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. మంత్రులు ట్విట్టర్ వేదికగా ఆందోళనలకు ఆజ్యం పోసేలా స్పందిస్తున్నారని, సికింద్రాబాద్ ఘటనలో రాజకీయ ప్రమేయం ఉందని ఆరోపించారు. అల్లర్ల వెనుక ఎవరు ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం తేల్చాలని డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ ముందుగా వన్ ర్యాంక్-వన్ పెన్షన్ గురించి తెలుసుకోవాలని సూచించారు. అగ్నిపథ్ గురించి చర్చించే వేదికలు అనేకం ఉన్నా సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. కేంద్ర పథకం కాబట్టి కేంద్ర ఆస్తులపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు. అగ్నిపథ్ గురించి అనుమానాలు ఉంటే ప్రజాస్వామ్య పద్దతిలో చర్చించేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.
అమిత్ షాతో కిషన్‌రెడ్డి భేటీ..
విలేకరుల సమావేశం అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కిషన్‌రెడ్డి భేటీ అయ్యారు. సికింద్రాబాద్ ఘటనతో పాటు రాష్ట్రంలో పరిస్థితులపై ఆయనతో చర్చించినట్టు సమావేశం. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి, పెండింగ్‌లో ఉన్న వివిధ అంశాలపై కూడా ఆయనతో చర్చించినట్టు తెలుస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.