Friday, November 22, 2024

HYDRA | ప్రజలందరి భాగస్వామ్యంతోనే ‘హైడ్రా’ ముందడుగు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : హైడ్రా కార్యాలయంలో లేక్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా ఆనంద్‌ మల్లిగవాడ్‌తో గురువారం హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ వీడియో కాన్షరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా రంగనాథ్‌ మాట్లాడుతూ… చెరువుల పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిదని అన్నారు. పర్యావరణానికి చెరువలే ఆదరువు అని అయన పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు చెరువు తల్లి లాంటిదని ఆయన అభివర్ణించారు. తాగు, సాగు నీరందించే చెరువులు పట్టణీకరణతో ప్రభావాన్ని కోల్పోయాయని అయన ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, హైడ్రా కార్యాలయం నుంచి నేరుగా బెంగళూరులో చెరువుల పునరుద్ధరణ జరిగిన తీరును రంగనాథ్‌ ఈ సమావేశంలో పరిశీలించారు. ఆ క్రమంలో బెంగళూరులో మురుగుతో, నీళ్లు లేకుండా ఉన్న వాటిని ఎలా మంచినీటి చెరువులుగా మార్చారో.. ఈ సందర్భంగా పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఏవీ రంగనాథ్‌కు లేక్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా ఆనంద్‌ వివరించారు.

అందులోభాగంగా బెంగళూరు మహానగంరలో మొత్తం 35 చెరువులను పునరుద్ధరించిన విధానాన్ని ఈ సందర్భంగా ఆనంద్‌ సోదాహరణగా తెలిపారు. అతి తక్కువ వ్యయంతో చెరువులకు పునరుజ్జీవనం కల్పించిన తీరును హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు ఆయన వివరించారు.

ఇక మురుగు నీటి కాలువలకు రెండు వైపులా మొక్కలు నాటడం, చెరువులోకి నీరు చేరే లోపే కొంత మేర శుద్ధి జరిగేలా బెంగళూరులో అమలు చేసిన విధానంపై క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేయాలని హైడ్రా అధికారులు నిర్ణయించారు. ఏపుగా పెరిగిన మొక్కలతో చక్కటి పర్యావరణం స్థానికులకు అందుతుందన్నారు. అందుకే ఈ కార్యక్రమంలో స్థానికులను పెద్ద సంఖ్యలో భాగస్వామ్యం కల్పించి.. వారికే నిర్వహణ బాధ్యతలు స్వచ్ఛందంగా తీసుకునేలా కసరత్తు జరుగుతుందని రంగనాథ్‌ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement