Sunday, November 3, 2024

కాంగ్రెస్ కు రాహులే అతిపెద్ద సమస్య..ప్ర‌శాంత్ కిషోర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ ప్లాన్ వేశాడంటే అది స‌క్సెస్ అయి తీరాల్సిందే. వ్యూహాలు ర‌చించ‌డంలో ఆయ‌న‌కి ఆయ‌నే సాటి అని ఇప్ప‌టికే ఏపీ సీఎం జ‌గ‌న్ విష‌యంలో రుజువైంది. కాగా ఇప్పుడు వైఎస్ ష‌ర్మిల తెలంగాణ‌లో కొత్త‌గా పెట్టిన పార్టీ వైఎస్ ఆర్ టీపికి త‌న మ‌ద్ద‌తుని ప్ర‌క‌టించారు. అంతేకాదు పీకే టీంని ష‌ర్మిల చేస్తోన్న పాద‌యాత్ర‌కి మ‌ద్ద‌తుగా ఉండ‌మ‌ని స‌ల‌హా ఇచ్చారు. పార్టీ ఏదైనా ప్ర‌శాంత్ కిషోర్ రంగంలోకి దిగారంటే ఆ లెక్కే వేరు. అయితే ప్ర‌శాంత్ కిషోర్ ..కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీని టార్గెట్ చేశార‌నిపిస్తోంది.బిజెపి బలాన్ని తక్కువగా అంచనా వేయటమే రాహుల్ గాంధీ అసలైన సమస్యగా పీకే వ్యాఖ్యానించ‌డం విశేషం. దేశంలో బిజెపి మీద ప్రత్యేకించి.. నరేంద్ర మోడీ మీద జనాల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోతోందని రాహుల్ భ్రమల్లో ముణిగిపోయారంటు పీకే అన్నారు.అంతేకాదు రాబోయే కొన్ని దశాబ్దాల పాటు బీజేపీ ప్రభావం దేశంపై ప‌క్కాగా ఉంటుందన్న వ్యాఖ్యలు వైర‌ల్ అవుతున్నాయి.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 40 ఏళ్ళపాటు కాంగ్రెస్ ప్రభావం దేశంపై ఎలాగైతే ఉందో.. అలాగే మరో 40 ఏళ్ళు బిజెపి ప్రభావం ఉంటుందని ప్ర‌శాంత్ కిషోర్ అన్నారు. రాజకీయాల పై రాహుల్ అంత సీరియస్ గా లేర‌ని పీకే ఎద్దేవా చేశారు. ఎందుకంటే ఈ మధ్యనే జరిగిన ప‌లు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో రాహుల్ పాల్గొన్న తీరును చూసిన తర్వాత చాలా మందికి ఇదే అనుమానాలు వచ్చాయి. దేశంలోని గ్రామాల్లోకి వెళ్ళి చూస్తే మోడీ ఎంత బలంగా ఉన్నారనే విషయం తెలుస్తుందని రాహుల్ ను ఉద్దేశించి పీకే కామెంట్ చేశారు.

ప్రజలు ఇప్పటికిప్పుడు బిజెపిని ఓడిస్తారనే భ్రమల నుంచి రాహుల్ బయటకు రావాలన్నారు. కాంగ్రెస్ కు రాహులే అతిపెద్ద సమస్యగా పీకే తేల్చేశారు.తాజాగా పీకే చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే రాహుల్ ను టార్గెట్ చేసుకున్నట్లు అర్ధమవుతోంది. మొన్నటి వరకు పీకే కాంగ్రెస్ లో చేరబోతున్నారని కీలకపదవి తీసుకుంటున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. అయితే తాజా పరిణామాల్లో పీకే కాంగ్రెస్ కు దూరమవ్వటం ఖాయమైపోయింది. అందుకనే తృణమూల్ తో కలిసి పీకే పనిచేస్తున్నారు. తాజాగా గోవాలో తృణమూల్ కాంగ్రెస్ తరపున పీకే పనిచేస్తున్నారు. ఇప్ప‌టికైనా రాహుల్ పై పీకే చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సీరియస్ గా తీసుకుంటే బాగుంటుంది. పార్టీని నిల‌బెట్టాలంటే అందుకు కృషి చేయాల్సింది చాలా ఉంటుంద‌నే పీకే ప‌రోక్షంగా చెప్పార‌నిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement