Saturday, November 23, 2024

ఆర్టీసీలో ‘కనెక్టింగ్‌’ బస్సులు! ఒకే రిజర్వేషన్‌ చార్జీపై పలు బస్సుల్లో ప్రయాణం

అమరావతి, ఆంధ్రప్రభ: ప్రయాణికులకు చేరువయ్యేందుకు ఎప్పటికప్పుడు కొత్త పథకాలతో అడుగులు వేస్తున్న ఏపీఎస్‌ ఆర్టీసీ మరో సరికొత్త విధానం అమలుకు సిద్ధమవుతోంది. తొందరలోనే మల్టిdలెగ్‌ ట్రావెల్‌ టిక్కెట్‌(ఎంఎల్‌టీటీ) పేరిట కొత్త ప్రయోగం చేయబోతోంది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి నేరుగా బస్సులు లేని పక్షంలో ఒకే టిక్కెట్టుపై కనెక్టింగ్‌ బస్సుల్లో ప్రయాణించేలా అధికారులు కొత్త పథకం రూపొందించారు. విమాన ప్రయాణాల్లో నేరుగా ఫ్లైట్‌ లేనప్పుడు కనెక్టింగ్‌ ఫ్లైట్‌ ఉంటుంది. ఒకే టిక్కెట్‌పై కనెక్టింగ్‌ ఫ్లైట్‌ ద్వారా గమ్యస్థానాలకు ప్రయాణికులు వెళ్లొచ్చు. ఇదే తరహాలో ఆర్టీసీ బస్సులను కూడా ఏర్పాటు చేయాలనేది ఉన్నతాధికారుల ఆలోచన.

దేశంలో ఈ తరహా పథకం ఎక్కడా లేదు. తొలిసారిగా ఈ పథకం ఏపీఎస్‌ ఆర్టీసీ తేబోతోంది. ఇప్పటికే ప్రాథమికంగా ఆర్టీసీ ఉన్నతాధికారులు పథకం అమలుపై చర్చించి తుదిరూపుకు తెచ్చారు. తొలి విడతలో ఎంపిక చేసిన రూట్లలో కొత్త విధానం అమలు చేసి..ప్రయాణికుల స్పందనను బట్టి విస్తరించనున్నారు. ప్రయాణికులకు ఒకే రిజర్వేషన్‌ చార్జీ వర్తించడంతో పాటు మార్గ మధ్యలో అవసరమైన పనులు చక్కబెట్టుకునేందుకు కూడా వీలుంటుంది. ఇప్పటికే పలు కొత్త పథకాలు, ఆఫర్లతో ప్రయాణికులకు చేరువైన ఆర్టీసీ..కొత్త విధానంలో మరింత దగ్గరవుతుందని అధికారులు భావిస్తున్నారు.

- Advertisement -

ఒకే రిజర్వేషన్‌ చార్జీతో..

ఒకే రిజర్వేషన్‌ చార్జీతో బస్సులు మారి గమ్యస్థానం చేరుకోవడమే కొత్త పథకం ఉద్దేశం. ఉదాహరణకు విశాఖపట్టణం నుంచి కడపకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు నేరుగా బస్సులు ఉండకపోవచ్చు. ఆ సందర్భంలో ప్రయాణికులు విజయవాడ వరకు రిజర్వేషన్‌ చేయించుకొని దిగాల్సి ఉంటుంది. ఆ తర్వాత మరోసారి కడప బస్సుకు టిక్కెట్టు తీసుకొని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. రెండు సార్లు టిక్కెట్‌ తీసుకోవడం వలన ఆర్టీసీకి రిజర్వేషన్‌ తదితర చార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. పైగా విజయవాడ నుంచి కడపకు ఏయే సమయాల్లో బస్సులు ఉన్నవనేది తెలుసుకోవడం కూడా ముందే తెలుసుకోవడం కొంత ఇబ్బందే. కొత్త విధానంలో విశాఖపట్టణంలో కడపకు టిక్కెట్‌ రిజర్వేషన్‌ చేయించుకున్నప్పుడు మార్గ మధ్యలో కడపకు సర్వీసులు ఉన్న బస్టాండ్లు డిస్‌ప్లే అవుతాయి. విశాఖ నుంచి సూచించిన బస్‌ స్టేషన్‌ చేరుకున్న తర్వాత నుంచి ఏయే సమయాల్లో కడపకు బస్సు ఉందనేది ముందే తెలుస్తుంది. అందుకు అనుగుణంగా బస్సును ఎంపిక చేసుకుంటే ఒకే టిక్కెట్టుతో విశాఖ నుంచి కడప వరకు కనెక్టింగ్‌ బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు. పైగా ఒకే బస్సులో గంటల తరబడి కూర్చోవడం ఇబ్బంది కాబట్టి మార్గ మధ్యలో కొంత శరీరానికి విశ్రాంతి కూడా ఇచ్చేందుకు కొత్త విధానంలో వీలుంటుంది.

ఇప్పటికే పలు పథకాలు..

కోవిడ్‌-19 తదనంతర కాలంలో ప్రయాణికులకు చేరువయ్యేందుకు ఏపీఎస్‌ ఆర్టీసీ ఎప్పటికప్పుడు కొత్త పథకాలు, ఆఫర్లు ప్రకటిస్తూ ముందుకెళుతోంది. గత సాంప్రదాయాలకు భిన్నంగా దసరా, సంక్రాంతి వంటి పెద్ద పండుగలకు అదనపు చార్జీలు లేకుండానే ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు. ఇదే సమయంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలకు ఆయా పర్వదినాల్లో ప్రత్యేక సర్వీసులను ఎటువంటి అదనపు రుసుములు లేకుండానే నడపడం ద్వారా ప్రయాణికులకు చేరువ అవ్వడం జరుగుతోంది. రాష్ట్రంలో ప్రత్యేక ఉత్సవాలు, తిరునాళ్లకు సైతం సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఏసీ సర్వీసుల్లో రిటన్‌ టిక్కెట్‌ ముందుస్తుగానే బుక్‌ చేసుకునే వారికి ప్రత్యేక రాయితీలు ఇస్తున్నారు. సీనియర్‌ సిటిజన్స్‌, మహిళలకు సహా అనేక ప్రత్యేక ఆఫర్లు ఇస్తూ ఎప్పటికప్పుడు ప్రయాణికుల మన్ననలు పొందేందుకు అధికారులు పలు చర్యలు చేపడుతున్నారు.

ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌..

ఏపీఎస్‌ ఆర్టీసీ అమలు చేస్తున్న ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ ప్రయాణికులకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంది. ఇంటి నుంచే నేరుగా టిక్కెట్టు రిజర్వేషన్‌ చేసుకొని ఆన్‌లైన్‌లో నగదు చెల్లింపులు చేసుకోవచ్చు. చివరకు పల్లె వెలుగు బస్సుల్లో సైతం ఈ విధానం అమలులో ఉంది. ఆర్టీసీ యాప్‌లో ముందస్తు రిజర్వేషన్‌ చేసుకునే ప్రయాణికులకు పలు రాయితీలను కూడా ఆర్టీసీ అందజేస్తోంది. ఇప్పటికే వినూత్న పథకాలు, ఆఫర్లతో ప్రయాణికులకు చేరువైన ఆర్టీసీ..కొత్త విధానంతో మరింత చేరువ అవుతుందనే ఆశాభావాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement