పంజాబ్ – హర్యానాల ఉమ్మడి రాజధానిగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్‌ను పంజాబ్‌లో తక్షణం కలిపేయాలని కోరుతూ శుక్రవారంనాడు శాసనసభలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తీర్మానం ప్రవేశపెట్టి సంచలనానికి తెరతీశారు. కేంద్రపాలిత ప్రాంతంలో పరిపాలనా సంతులతను కేంద్రం తారుమారు చేస్తోందని విమర్శించారు. చండీగఢ్‌లో ఆధిపత్యంకోసం అటు కేంద్రం, ఇటు రాష్ట్రం మధ్య పోరాటం జరుగుతున్న నేపథ్యంలో మాన్ అసెంబ్లిలో తీర్మానం ప్రవేశపెట్టడం విశేషం. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో సంపూర్ణ ఆధిక్యంతో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ తరపున సీఎంగా అధికారం చేపట్టి రెండువారాలు కూడా కాకముందే భగవంత్ మాన్ సాహసోపేతమైన అడుగు వేశారు. చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోకి వచ్చే ఉద్యోగుల సర్వీసు రూల్స్ మారుస్తూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వారికీ అన్ని ప్రయోజనాలు కల్పించింది. దీనిపై స్పందించిన పంజాబ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ తాజాగా తీర్మానం ప్రవేశపెట్టింది. 1966లో రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం హర్యానా, చండీగఢ్‌లలో పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాలు, హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలను కలిపారని గుర్తు చేశారు. అప్పటినుంచి మూడు ప్రాంతాల్లో భాక్రా-బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డు వంటి ఉమ్మడి ఆస్తులపై నిర్వహణ బాధ్యతలను హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు ఇచ్చారని చెప్పారు.
అయితే, అందుకు విరుద్ధంగా ఇటీవలి కాలంలో కేంద్రప్రభుత్వం వ్యవహరిస్తోందని అభ్యంతరం వ్యక్తం చేశారు. భాక్రా – బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డు సభ్యుల నియామకానికి సంబంధించి పంజాబ్, హర్యానాలకు అధికారం ఉంటే, దానికి విరుద్ధంగా కేంద్రమే భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చిన విషయాన్ని మాన్ శాసనసభలో ప్రస్తావించారు. అలాగే, చండీగఢ్ పరిపాలనా యంత్రాంగం నిర్వహణ బాధ్యతలు పంజాబ్, హర్యానా ప్రభుత్వాల చేతుల్లో 60:40 నిష్పత్తిలో ఉన్నాయని, కానీ కేంద్రం ఇటవీలి కాలంలో దానికి విరుద్ధంగా వ్యవహరించిందని ఆరోపించారు. రాష్ట్రేతర ప్రాంతాలనుంచి అధికారులను ఇక్కడ నియమించిందని, అలాగే ఇక్కడి ఉద్యోగులకు కేంద్ర సర్వీసు రూల్స్ వర్తింప చేస్తోందని, ఇది గత ఒప్పందాలకు విరుద్ధమని మాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. చండీగఢ్ ఉద్యోగులకు కేంద్రం సర్వీసురూల్స్ వర్తింప చేస్తూ అన్ని ప్రయోజనాలు కల్పిస్తామని, మంగళవారం నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని కేంద్రహోంమంత్రి అమిత్ షా ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో పంజాబ్‌లోని విపక్షాలు ఆందోళనకు దిగాయి. చండీగఢ్‌పై అధికారాన్ని కోల్పోయే ప్రమాందని విపక్షాలు గగ్గోలుపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన ఆప్ ప్రభుత్వం అనూహ్యంగా తీర్మానం ప్రవేశపెట్టింది. ప్రజాస్వామ్యస్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం వైఖరిని కాంగ్రెస్, అకాలీదళ్ కూడా తప్పుపట్టాయి
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..