Friday, November 22, 2024

నేడే కాంగ్రెస్ య‌వ సంఘర్ష‌ణ స‌భ – చీఫ్ గెస్ట్ గా ప్రియాంకా గాంధీ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: న‌ఏడ నేడు కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో స‌రూర్ న‌గ‌ర్ స్టేడియంలోయువ సంఘ‌ర్ష‌ణ స‌భ జ‌ర‌గ‌నుంది.. ఈ స‌భ‌లో ముఖ్య అతిథిగా ప్రియాంకా గాంధీ పాల్గొన‌నున్నారు… స‌భ‌లోనే తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్‌ విద్యార్థి, నిరుద్యోగ యువతకు ఉత్తుత్తి హామీలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత ప్రియాంకగాంధీ ధ్వజమెత్తనున్నారు. అధికారంలోకి రాకముందు రాష్ట్రంలోని విద్యార్థి, యువతకు కల్లబొల్లి మాటలు చెప్పి రిక్తహస్తాలు చూపించారని, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో ఇచ్చిన హామీలు నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని ఆమె యువ సంఘర్షణ సభలో హామీ ఇవ్వనున్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచే ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసే ప్రక్రియకు శ్రీకారం చుడతామని, దశలవారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేస్తామని యువతకు హామీ ఇవ్వనున్నారు. 2018 ఎన్నికల్లో ప్రకటించిన విధంగా నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చేదాకా ప్రతి నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతిని చెల్లిస్తామని, ఇది కూడా ప్రతినెలా మొదటి వారంలో వారి బ్యాంకు ఖాతాలో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటా మని ఈ సభ వేదికగా ప్రకటించనున్నారు

రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వం నిర్వహించిన నియామక రీక్షల ప్రశ్నాపత్రాలు బయటికి పొక్కిన విషయాన్ని ఈ సభలో ఆమె ప్రధానంగా ప్రస్తావించనున్నారు. రాష్ట్రంలోని 40 లక్షల మంది నిరుద్యోగ యువతతో కేసీఆర్‌ ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆమె దుయ్యబట్టనున్నారు. రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతున్న కేసీఆర్‌ ప్రభుత్వం 2018లో జరిగిన అసెంబ్లి ఎన్నికల్లో నిరుద్యోగ యువతను దగా చేసి వారి ఓట్లతో అందలం ఎక్కిన విషయాన్ని ప్రియాంక నేటి సభలో ప్రస్తావించనున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగ యువతకు భృతి ఇస్తానన్న కేసీఆర్‌ ఆ హామీని విస్మరించి వారి జీవితాలను అంధకారం చేశారని ప్రస్తుతం ఉద్యోగాలను భర్తీ చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని, పోటీ పరీక్షలను నిర్వహించలేక కేసీఆర్‌ సర్కార్‌ చేతులెత్తేసిందని ఆమె ఆరోపించనున్నారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అక్రమాలకు నిలయంగా ప్రశ్నాపత్రాల లీకేజీలకు కేంద్రంగా మారిందని, మరో ఐదారు నెలల్లో అసెంబ్లిd ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మరోసారి నిరుద్యోగ యువతను దగా చేసి తద్వారా వారి ఓట్లను పొందే ప్రయత్నం చేస్తోందని, అప్రమత్తంగా ఉండాలని ఈ సభ ద్వారా యువతను కోరనున్నారు. రాష్ట్రంలో వివిధ కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం గత మూడేళ్లుగా బోధనా ఫీజులను చెల్లించడంలేదని దీంతో వారు మధ్యలోనే చదవును మధ్యలోనే ఆపేస్తున్నారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్‌లో ఉన్న ఫీజులన్నింటిని ఏకకాలంలో చెల్లించి విద్యార్థులు తమ చదువులను కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని ప్రియాంకగాంధీ విద్యార్థులకు భరోసా ఇవ్వనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement