న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తదుపరి జాబితా విడుదలకు మరికొంత పట్టేలా ఉంది. ఇప్పటికే 55 మంది పేర్లతో తొలి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్ నాయకత్వం, 2వ జాబితా విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరిస్తోంది. తొలి జాబితా విడుదల తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కసరత్తు విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిసింది. చివరి నిమిషంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు ఎక్కువ ప్రాధాన్యత కల్పించారన్న విమర్శలతో పాటు టికెట్ ఆశించి భంగపడ్డ ఆశావహులు రెబెల్స్‌గా మారుతుండడం కూడా పార్టీ అధిష్టానం పెద్దలను ఆలోచనలో పడేసింది.
శనివారం పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో 2వ జాబితాపై సుదీర్ఘ కసరత్తు జరిపిన నేతలు, ఆదివారం ఉదయం గం. 10.00 నుంచే పార్టీ వార్‌రూం వేదికగా మరోసారి సమావేశమయ్యారు. ఈ భేటీలో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో పాటు ఖమ్మం జిల్లా నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా హాజరయ్యారు. దీంతో ఈ భేటీలో ఖమ్మం జిల్లాకు సంబంధించిన అంశాలపై చర్చించినట్టు తెలిసింది.
జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన ‘ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్’లో భాగంగా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు సీపీఐ, సీపీఐ(ఎం)కు ఇవ్వనున్న సీట్ల విషయంలోనే తర్జన భర్జన జరుగుతోంది. రెండు పార్టీలు చెరో 5 సీట్లు డిమాండ్ చేసినప్పటికీ చెరో 2 సీట్లు తీసుకునేందుకు అంగీకరించాయి. సీపీఐకు చెన్నూరు, కొత్తగూడెం సీట్లను, సీపీఐ(ఎం)కు వైరా, మిర్యాలగూడ సీట్లను కాంగ్రెస్ పార్టీ ఇచ్చేందుకు సిద్ధపడినట్టు తెలిసింది. అయితే ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన నేతలతో పాటు కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
చెన్నూరులో బాల్క సుమన్‌పై కాంగ్రెస్ అభ్యర్థి బరిలో ఉంటేనే ఓడించగలమని, పొత్తుల్లో భాగంగా సీపీఐకు సీటు ఇస్తే సుమన్ సునాయాసంగా గెలుపొందుతారని అక్కణ్ణుంచి టికెట్ ఆశిస్తున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుర్గం భాస్కర్ చెబుతున్నారు. మరోవైపు వైరాలో 2018లో పొత్తుల్లో భాగంగా కమ్యూనిస్టులకు ఈ సీటు ఇవ్వగా.. అక్కడ స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారని, అది కాంగ్రెస్ గెలిచే సీటు అని అక్కడి కార్యకర్తలు, నేతలు చెబుతూ ఆందోళనకు దిగారు.
ఇదిలా ఉంటే చర్చల్లో భాగంగా సీపీఐ(ఎం) తమకు పాలేరు సీటు కావాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరినట్టు తెలిసింది. పాలేరు నుంచి పోటీకి సిద్ధపడ్డ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఆ సీటును మిత్రపక్షాలకు ఇచ్చేందుకు ససేమిరా ఒప్పుకోవడం లేదని తెలిసింది. ఈ విషయం గురించి చర్చించడం కోసమే ఆయన ఢిల్లీకి వచ్చి మరీ స్క్రీనింగ్ కమిటీ పెద్దలతో సమావేశమయ్యారు. మిర్యాలగూడాలో కూడా టికెట్లు ఆశిస్తున్న కాంగ్రెస్ ఆశావాహులు ఆ స్థానాన్ని కమ్యూనిస్ట్ పార్టీలకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారు.
రాజీ ఫార్ములా
దీంతో పాటు కొన్ని సీట్ల విషయంలో బలమైన నేతల మధ్య గట్టి పోటీ నెలకొనడంతో స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ ఆశావహులను ఢిల్లీకి పిలిపించి పోటీ పడుతున్న నేతలను కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. జాబితా ప్రకటించిన తర్వాత ఒక్కసారిగా నేతలు క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుని రెబెల్స్‌గా మారుతున్నారని, ఆ పరిస్థితిని నివారించాలంటే ముందే అందరినీ ఒక చోట కూర్చోబెట్టి సర్దిచెప్పడం, అందరి మధ్య రాజీ ఫార్ములా తీసుకురావడం ఉత్తమం అన్న ఆలోచనలో అధిష్టానం ఉంది.
ఈ క్రమంలో శని, ఆదివారాల్లో ఆశావహులు పలువురుని అధిష్టానం పెద్దలు పిలిచి మాట్లాడినట్టు తెలిసింది. అలా ఢిల్లీ వచ్చినవారిలో పాలకుర్తి నుంచి టికెట్ ఆశిస్తున్న యర్రంరెడ్డి తిరుపతి రెడ్డి, పర్కాల నుంచి టికెట్ ఆశిస్తున్న ఇనగాల వెంకట్రామి రెడ్డి సహా రిజర్వుడు స్థానాల నుంచి టికెట్లు ఆశిస్తున్న పలువురు నేతలున్నారు.
ఈసారి ఎలాగైనా పార్టీని గెలిపించాలని, ఈ క్రమంలో టికెట్ ఆశించినా, త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలని అధిష్టానం పెద్దలు సూచిస్తున్నారు. ఇప్పుడు త్యాగం చేసినవారిని పార్టీ గెలిచిన తర్వాత తప్పకుండా ఆదుకుంటుందని, నామినేటెడ్ పోస్టులు, ఇతర పదవుల ద్వారా వారికి సముచిత ప్రాధాన్యత కల్పిస్తుందని అధిష్టానం భరోసా ఇస్తోంది.
సీఈసీ భేటీ తర్వాతే జాబితా
ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్నది ఆశావహుల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నమే తప్ప అభ్యర్థుల జాబితాను ఆమోదించే ప్రక్రియ కాదు. రాజీ ఫార్ములా అనంతరం వడపోసిన అభ్యర్థుల జాబితాను స్క్రీనింగ్ కమిటీ పార్టీ అధిష్టానానికి అందజేస్తుంది. దానిపై కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశమై, చర్చించి ఆమోదముద్ర వేస్తుంది.
ఆ తర్వాతే జాబితా విడుదలవుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న కసరత్తు పూర్తికావడానికి మరికొన్నాళ్లు సమయం పడుతుందని, ఈనెల 25 లేదా 26 తేదీల్లో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ జరిగే అవకాశం ఉందని పార్టీవర్గాలు చెప్పాయి. ఆ తర్వాత విడతలవారిగా కొన్ని కొన్ని పేర్లతో జాబితాలను అధిష్టానం విడుదల చేసే అవకాశం ఉంది.