న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ఓటుబ్యాంకు 10-15 శాతం వరకు పెరిగిందని, తమతో పొత్తు పెట్టుకున్న పార్టీ అధికారంలోకి వస్తుందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ అన్నారు. సోమవారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‍లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన, తమిళనాడు తరహాలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మారిందని, కాంగ్రెస్‌తో జత కట్టిన పార్టీ గెలవబోతుందని వ్యాఖ్యానించారు.
తెలుగుదేశం – జనసేన పొత్తును ఆహ్వానిస్తున్నామని, కాంగ్రెస్‌తో కూడా కలిస్తే తప్పకుండా అధికారంలోకి వస్తారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని, 75 స్థానాల్లో విజయం సాధిస్తుందని అన్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై కేసు నమోదు చేయడం తప్పు అని, ఆయన్ను వెంటనే విడుదల చేయాలని చింతా మోహన్ డిమాండ్ చేశారు.
తమ నేత రాహుల్ గాంధీని ఇబ్బంది పెట్టినట్టే ఇప్పుడు చంద్రబాబును ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. కోర్టుల్లో రాజకీయ జోక్యం ఎక్కువగా కనిపిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు మంచివాడని, వ్యక్తిగతంగా ఆయన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు.
దేశంలో బీసీలకు 27% రిజర్వేషన్లు కల్పించేందుకు 2005లో రాజ్యాంగ సవరణ చేసింది కాంగ్రెస్ పార్టీయేనని చింతా మోహన్ గుర్తుచేశారు. 75 సంవత్సరాల్లో ఓబీసీలు రాజకీయంగా ముందుకు వెళ్లలేదని, వారికి రాజకీయ రిజర్వేషన్లు కూడా కల్పించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.