Thursday, December 12, 2024

TG | తెలంగాణ తల్లిపై కుట్ర.. ఆ కాంగ్రెస్ తల్లిని గాంధీ భవన్ కి పంపిస్తాం : కేటీఆర్

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా గండిమైసమ్మ సమీపంలో నిర్మించిన బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేటీఆర్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, సీనియర్‌ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ… ఇవాళ రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసింది తెలంగాణ తల్లి విగ్రహం కాదని, కాంగ్రెస్ తల్లి విగ్రహమని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో కవులు, కళాకారులు, శిల్పుల నాయకత్వంలో సమిష్టిగా ఆవిర్భవించిందే తెలంగాణ తల్లి అని కేటీఆర్ పేర్కొన్నారు.

తెలంగాణ కోసం ఉక్కు సంకల్పంతో 15 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ దీక్ష చేపట్టారన్నారు. ఈ దీక్ష విజయవంతమైన రోజును విజయ్ దివస్ గా జరుపుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణ సాధకుడిగా కేసీఆర్ పేరు చిరస్థాయిలో నిలిచి పోతుంద‌ని… తెలంగాణ ద్రోహిగా రేవంత్ రెడ్డి మిగిలిపోవడం ఖాయం అని పేర్కొన్నారు.

- Advertisement -

‘‘హంతకులే సంతాప సభలు చెప్పినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి పైన కూడా కుట్రలు చేస్తుంది. తెలంగాణ తల్లి ఔనత్యాన్ని, గౌరవాన్ని తగ్గించేలా పేదరాలి లెక్క రాష్ట్రాన్ని దివాలా తీసిన తీరుగా రూపొందించిన ఈ దివాళ కోరు పాలకులు తమ భావ దారిత్యాన్ని చూపించారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని కాళోజీ నారాయణ రావు పొగిడారు. దేవతా రూపంలో ఉన్న తల్లిని చిన్నగా చూపే ప్రయత్నం చేస్తున్నారు.

తల్లిని మార్చిన మూర్ఖులు ప్రపంచంలో ఎవరూ లేరు… కానీ తెలంగాణ తల్లిని మార్చిన దరిద్రులు తెలంగాణలో ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చమని ఈ ప్రభుత్వాన్ని ఎవరు అడిగారు? ప్రభుత్వాలు మారినప్పుడు ప్రజల తలరాతలు మారాలి కానీ తల్లులు మారుతారా?. ప్రభుత్వాలు మారినప్పుడు భరతమాత గానీ, తెలుగు తల్లి గానీ మారిందా?. అధికారంలోకి వచ్చినాక తెలంగాణ ప్రజల బతుకులు నాశనం చేస్తున్నారు, దాంతోపాటు ఇప్పుడు తెలంగాణ బతుకమ్మను కూడా నాశనం చేసారు.

తెలంగాణ తల్లి అంటే ఒక వ్యక్తి, ఒక వ్యవస్థ, ఒక పార్టీ కోసం సంబంధించినది కాదు; మొత్తం తెలంగాణ సమాజాన్ని జాగ్రత్తపరిచిన గొప్ప స్ఫూర్తి. ఇప్పటికే తెలంగాణలో బతుకమ్మ చీరలను మాయం చేసిన ప్రభుత్వం, తెలంగాణ పథకాలను మాయం చేసిన ప్రభుత్వం, మొత్తం తెలంగాణనే మాయం చేయాలని కుట్ర చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా, భారీ మెజార్టీతో అధికారంలోకి రావడం ఖాయం.

కేసీఆర్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజే సచివాలయం ముందు ఉన్న రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాన్ని గాంధీభవన్ కి పంపిస్తాం. ఇదే విధంగా ఈరోజు కాంగ్రెస్ తల్లిని పెట్టి తెలంగాణ పేరుతో మోసం చేస్తున్నారో, ఆ కాంగ్రెస్ తల్లిని గాంధీభవన్ పంపిస్తాం. కాంగ్రెస్ తల్లి భస్మాసుర హస్తం చూపిస్తూ అభయహస్తం అంటూ మోసం చేస్తుంది

అరచేతిలో వైకుంఠం చూపించి ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తోంది ఇదే కాంగ్రెస్ తల్లి. తెలంగాణ ప్రజలు మోసపడేటట్లు చేసిన కాంగ్రెస్ తల్లిని కచ్చితంగా గాంధీభవన్ కి పంపిస్తాం. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని, కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని పంపించడం ఖాయం అన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలి. ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించిన మేడ్చల్ జిల్లా అధ్యక్షులు,ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, కుతుబుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ గారికి మరియు పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు.

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తల్లి విగ్రహ రాజకీయానికి నిరసనగా రేపు భారత రాష్ట్ర సమితి పలు శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. తెలంగాణ తల్లి పేరు చెప్పి ఈరోజు కాంగ్రెస్ తల్లి పేరుతో ఈ ప్రభుత్వం చేసిన అపచారానికి నిరసనగా రేపు తెలంగాణలో ఉన్న ప్రతి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకాలతో పాటు పంచామృత అభిషేకాలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ మూర్ఖులు చేసిన అపచారానికి, “కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ చరిత్ర తెలీదు” అని తెలంగాణ తల్లిని వేడుకుందాం, క్షమించమని అడుగుదామని’’ కేటీఆర్ పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement