హైదరాబాద్, ఆంధ్రప్రభ: సాధారణ ఎన్నికల ఘడియలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ రాజకీయ అస్త్రాలకు పదును పెడుతోంది. క్షేత్ర స్థాయిలో సమావేశాలు నిర్వహించి ప్రజల అకాంక్షలు, ఆలోచనలను పరిగణలోకి తీసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహంచేందుకు రాజకీయ వ్యూహ రచన చేస్తోంది. రాష్ట్రంలోని 32వేల 700 పోలింగ్ బూత్ స్థాయి కమిటీలను బలోపేతం చేసి ఆ కమిటీల ద్వారా కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు కార్యక్రమాలు రూపకల్పన చేస్తున్నారు.
ఇందులో భాగంగా గాంధీ జయంతి నుంచి కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత పర్యటనలకు కార్యక్రమాలు రూపొందించింది. ఆదిలాబాద్ నుంచి కమిటీ కార్యక్రమాలను ప్రారంభించేందుకు రంగం సిద్దం చేసింది. అలాగే స్థానిక నాయకులు ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలుత కమిటీల సమావేశాలు నిర్వహించి స్థానిక సమస్యలపై అంచావేసి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైంది.
రాష్ట్రంలో గ్రామస్థాయినుంచి రాష్ట్ర స్థాయివరకు కమిటీలు, అనుబంధ సంఘాల కార్యకలాపాలున్న కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం కింది స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించేందుకు కార్యక్రమాలు రూపొందిస్తోంది. నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు సిద్ధమైన నాయకులు ఎన్నికలయ్యేంతవరకు క్షేత్ర స్థాయిలో ఓటర్లను ప్రభావితం చేస్తూ ప్రజాక్షేత్రంలో ఉండే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు.
అక్టోబర్ మొదటి వారంలో తొలిజాబితా
సీట్లను ఆశించే వారి సంఖ్య అత్యధికంగా ఉండటంతో ఆశించిన నాయకులు తెస్తున్న ఒత్తిడి మేరకు జాబీతాలోని పేర్ల పరిశీలన టీపీసీసీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం హస్తినాలో స్క్రీనింగ్ కమిటీతో భేటీ జరిపి తొలి జాబీతాను అక్టోబర్ మొదటి వారంలో ప్రకటించే అవకాశాలున్నాయి. అయితే ముందు ప్రకటించిన విధంగా ఆదివారం కాంగ్రెస్ అధిష్టానం స్టీరింగ్ కమిటీతో సమావేశం జరపాల్సి ఉండగా ప్రస్తుతం వాయిదా పడింది.
మంగళవారం లేదా బుధవారం స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగే అవకాశాలున్నాయి. ఈ కమిటీ సమావేశానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తో పాటుగా మధుయాస్కీ, కోమటి రెడ్డి రాజగోపాలరెడ్డి హాజరుకానున్నారు. ప్రధానంగా ఈ సమావేశంలో బీసీ సీట్ల వ్యవహారం, కొత్తగా పార్టీలోకి వస్తున్న నేతలకోెరికలపై అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు సమాచారం.
సమావేశం అనంతరం కాంగ్రెస్ అధిష్టానం తొలిజాబితా ప్రకటించనుందని తెలుస్తోంది.అయితే ఇప్పటికే గాంధీ భవన్ సాక్షిగా బీసీసీట్ల పంచాయితీ ముదరడంతో ఈ అంశం అదిష్టానం పరిధిలోకి చేరింది.ఉదయ్ పూర్ డిక్లరేషన్ మేరకు ప్రతి పార్లమెంట్ నియోజక వర్గం పరిధిలో రెండు అసెంబ్లిd స్థానాలు బీసీలకు కేటాయించాలనే టీపీసీసీ బీసీ నేతల డిమాండ్ ను అధిష్టానం ఏమేరకు పరిశీలిస్తుందో వేచి చూడాలి.