Tuesday, November 26, 2024

Delhi | బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెసే అండ : పొన్నాల, ప్రభాకర్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కాంగ్రెస్‌తోనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆ పార్టీ సీనియర్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. శుక్రవారం టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో సర్దార్ సర్వాయి పాపన్న 373వ జయంతి వేడుకలు నిర్వహించారు.

సర్దార్ పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ రాచరికాన్ని ఎదిరించి స్వేచ్చ కోసం ఉద్యమించి గోల్కొండ కోటను ఆక్రమించిన ధీరుడు సర్వాయి పాపన్న అని కొనియాడారు. ప్రజలకు స్వేచ్ఛ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన మహనీయుడని గుర్తు చేశారు. సర్ధార్ సర్వాయి పాపన్న పుట్టిన గ్రామంలోనే తాను పుట్టానని పొన్నాల లక్ష్మయ్య గుర్తు చేశారు.

ఆయన జీవితం తనకు స్ఫూర్తిదాయకమని, లండన్‌లో ఉన్న చిత్రపటం ఆధారంగా పాపన్న మొదటి విగ్రహం చేయించానని వెల్లడించారు. అనంతరం పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ అన్ని కులలాల వారిని కలుపుకుని గోల్కొండ కోటను ఆక్రమించిన వ్యక్తి సర్వాయి పాపన్న అని సంతోషం వ్యక్తం చేశారు. ఆయన ఇచ్చిన దైర్యం, స్ఫూర్తితో ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను కలుపుకును ముందుకు వెళ్తుందని, అందరికీ ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. బలహీన వర్గాల్లో అసంతృప్తి తలెత్తకుండా చూసుకోవాలన్న పొన్నం, పార్టీ అధిష్టానం, రాష్ట్ర నాయకత్వం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. బడుగు బలహీన వర్గాలకు పార్టీ రక్షణ కల్పిస్తుందని స్పష్టం చేశారు. ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌కు అనుగుణంగా బడుగు బలహీన పార్టీ పదవుల్లో ప్రాధాన్యత ఉంటుందని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement