Friday, November 22, 2024

ఉత్తర తెలంగాణపై కాంగ్రెస్‌ ప్రత్యేక ఫోకస్‌.. ఈ నెల 14న మంచిర్యాల జిల్లాలో భారీ బహిరంగ సభ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఉత్తర తెలంగాణపై కాంగ్రెస్‌ పార్టీ మరింత ఫోకస్‌ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో మెరుగైన స్థానాలు దక్కించుకోవాలనే పట్టుదలతో ఆ పార్టీ నేతలు ఇప్పటి నుంచే ప్లాన్‌ చేస్తున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్‌ శాసన సభాపక్ష నేత భట్టి విక్రమార్క ‘ పీపుల్స్‌ మార్చ్‌ ‘ పేరుతో ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లాలో చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి ఆపూర్వ స్పందన లభిస్తోంది. పాదయాత్రకు మద్దతుగా ఈ నెల 14న మంచిర్యాల జిల్లాలో దాదాపుగా లక్ష మందితో భారీ బహిరంగ సభను నిర్వహించేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటు ఏఐసీసీ అగ్రనేతలు, రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలు కూడా హాజరుకానున్నారు. ఈ బహిరంగ సభను విజయవంతం చేయడం వల్ల పార్టీ కేడర్‌లో మరింత జోష్‌ వస్తుందనే అభిప్రాయంతో కాంగ్రెస్‌ నేతలున్నారు. మొదటి సభ విజయవంతమైతే దాని ప్రభావం వచ్చే ఎన్నికల వరకు ఉంటుందనే భావనలో ఆ పార్టీ నాయకులున్నారు.

దక్షిణ తెలంగాణ కంటే.. ఉత్తర తెలంగాణలో పార్టీ కాస్త బలహీనంగా ఉందని, భారీ సభలను ఏర్పాటు చేయవడం వల్ల కేడర్‌లో జోష్‌ పెరగడంతో పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. పాదయాత్రలో భాగంగా ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులు, సమస్యలను బహిరంగ లేఖల ద్వారా ప్రభుత్వం దృష్టికి భట్టి విక్రమార్క తీసుకెళ్లుతున్నారు. ఆదివాసీ గిరజన ప్రజలతో మమేకమై.. వారి సమస్యలను ఓపిగా వింటున్నారు. ప్రధానంగా పోడు భూములు, దళిత, గిరిజనులకు ప్రభుత్వం ఇస్తామన్న 3 ఎకరాల భూ పంపిణి, నిరుద్యోగ సమస్య, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, విద్య, వైద్యం, రైతు రుణమాఫీతో పాటు సింగరేణి ప్రయివేటీకరణ అంశంపై ఎక్కువగా దృష్టి సారించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల ముందు ఎండగడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే పోడు భూములను సమస్యు పరిష్కరిస్తామని హామీ ఇస్తూ ఆదివాసి గిరిజనులను కాంగ్రెస్‌ వైపు తిప్పుకునేందుకు భట్టి విక్రమార్క ప్రయత్నం చేస్తున్నారు.

అంతే కాకుండా రూ. 2 లక్షల వరకు రైతు రుణమాపీ చేస్తామని హామీ ఇస్తూనే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కాంగ్రెస్‌ హయాంలో తీసుకొచ్చిన సబ్‌ప్లాన్‌ చట్టాన్ని పూర్తిగా అమలు చేస్తామని, మహిళా సాధికారత కోసం కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటామని ప్రజలకు వివరిస్తున్నారు. కాగా, మార్చి 16న ఉమ్మడి అదిలాబాద్‌లోని బోథ్‌ నియోజక వర్గం ఇచ్చొడ మండంలోని పిప్పిరి గ్రామం నుంచి భట్టి విక్రమార్క పాదయాత్రను మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఆదివారం వరకు పాదయాత్ర 22 రోజులకు చేరింది. ఇప్పటీ వరకు ఐదు నియోజ వర్గాల్లో బోథ్‌, ఖానాపూర్‌, అసిఫాబాద్‌, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజక వర్గాలు పూర్తిగా కాగా, చెన్నూరు నియోజక వర్గంలో భట్టి యాత్ర కొనసాగుతుండగా.. 280 కిలోమీటర్లకు పైగా పూర్తయింది. అయితే పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్రను రాష్ట్ర వ్యాప్తంగా 40 అసెంబ్లిd నియోజక వర్గాల్లో 90 రోజుల పాటు సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన భట్టి విక్రమార్క.. మూడు బహిరంగ సభలను నిర్వహించాలని ప్లాన్‌ చేశారు. మొదటి సభలను మంచిర్యాల జిల్లాలో, రెండో సభ రంగారెడ్డి జిల్లాలో నిర్వహించాలని, పాదయాత్ర ముగింపు సందర్భంగా మూడో సభను ఖమ్మంలో లక్షలాది మందితో భారీగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement