హైదరాబాద్ : కుల సర్వే, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపుపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కులగణన డెడికేటెడ్ కమిషన్‌కు నివేదిక సమర్పించాలని తెలంగాణ జాగృతి సంస్థ నిర్ణయించింది.
జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి నాయకులతో కలిసి కులగణన డెడికేషన్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావుకు నివేదిక అందజేయనున్నారు.
ఈ మేరకు శుక్రవారం తన నివాసంలో కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు.
కులగణన, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపుపై జాగృతి ఆధ్వర్యంలో కొన్ని నెలల క్రితం అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సమావేశాల్లో తెలంగాణ జాగృతి నాయకులు, బీసీ సంఘాల నేతలు, మేధావులు, జర్నలిస్టులు, ఇతర ప్రముఖులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.
వాటిని క్రోడీకరించి తెలంగాణ విజిలెన్స్ నివేదికను సిద్ధం చేసింది. జిల్లాల వారీగా పూర్తి వివరాలు, బీసీల లెక్కలతో కూడిన సమగ్ర నివేదికను తెలంగాణ జాగృతి సిద్ధం చేసింది.
తెలంగాణ సామాజిక స్వరూపాన్ని ఆవిష్కరించే విధంగా పకడ్బందీగా నివేదికను తయారు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నాటి కేంద్ర ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీకి ఇదే నివేదిక సమర్పించడం గమనార్హం.
ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ… రాజకీయ విద్య, ఉద్యోగ రంగాల్లో బడుగు బలహీన వర్గాలకు సరైన ప్రాధాన్యత లభించడం లేదన్నారు. సమాజంలోని అంతరాలను తొలగించి బలహీనవర్గాల అభ్యున్నతికి ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా బీసీలకు రాజకీయ రంగంలో రిజర్వేషన్లు పెంచాలని తీర్మానించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కులాల సర్వే నామమాత్రమే కాకుండా రిజర్వేషన్లు పెంచి పకడ్బందీగా చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.