Tuesday, November 19, 2024

Delhi | కేబినెట్ నిర్ణయాలతో కాంగ్రెస్‌కు వణుకు పుట్టింది.. కాంగ్రెస్ ధర్నాపై బీఆర్ఎస్ ఎంపీల ధ్వజం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సహా తెలంగాణ మంత్రివర్గం తీసుకున్న కీలక నిర్ణయాలతో కాంగ్రెస్‌ కాళ్ల కింది భూమి కదిలిందని, వెన్నులో వణుకు మొదలైందని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎంపీలు అన్నారు. మంగళవారం ఢిల్లీలో తెలంగాణ పీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా కాంగ్రెస్ నేతలు చేసిన ధర్నాకు వ్యతిరేకంగా మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ఎంపీల ఆరోపణలను తిప్పికొడుతూ.. రైతులకు 3 గంటల కరెంట్ చాలన్న నేతలు తమకు నీతులు చెప్పాల్సిన పనిలేదని ఎద్దేవా చేశారు. తొలుత బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు మాట్లాడుతూ.. గత 25 ఏళ్లలో ఎన్నడూ లేనిరీతిలో భారీ వర్షాలు కురిశాయని, ఆ ప్రభావంతో వరదలు సంభవించినప్పటికీ సకాలంలో ప్రభుత్వం సహాయ బృందాలను, ప్రజా ప్రతినిధులను, అధికారులను రంగంలోకి దించిందని వెల్లడించారు.

వరదలు తగ్గిన వెంటనే అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కట్టుదిట్టమైన చర్యల కారణంగా దోమలు, వ్యాధులు లేకుండా చూసుకోగలిగామని చెప్పారు. వరదల వంటి విపత్తుల సమయంలో ముఖ్యమంత్రి ముంపు ప్రాంతాలకు వెళ్లడం కంటే మానిటరింగ్ చేస్తూ బాధితులకు తక్షణ సహాయం అందించడం ముఖ్యమని కేకే అన్నారు. వరద ప్రాంతాలకు వెళ్లి ఫొటోలు దిగడం అంత ముఖ్యం కాదని అన్నారు. చాలా జిల్లాల్లో సాధారణం కంటే 66% అధిక వర్షపాతం నమోదైందని, 21 జిల్లాల్లో ఇంకా లెక్కించలేనంత అత్యధిక వర్షపాతం నమోదైందని అన్నారు. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలు వర్షాలు, వరదలకు ప్రభావితమయ్యాయని, శాస్త్రీయంగా ఈ పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొందని వెల్లడించారు.

- Advertisement -

కేసీఆర్‌ను అనడానికి నోరెలా వచ్చింది? – నామ

సీఎం కేసీఆర్‌ను రైతు హంతకుడు అనడానికి నోరెలా వచ్చిందని బీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత నామ నాగేశ్వర రావు అన్నారు. అంతకు ముందు కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ను రైతు హంతకుడు అని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని, లేదంటే తెలంగాణ రైతు సమాజమే తగిన బుద్ధి చెబుతుందని అన్నారు. తెలంగాణ రాక ముందు రాష్ట్రంలో వ్యవసాయం ఎలా ఉందో, వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలతో వ్యవసాయం ఎలా ఉందో రైతులకు తెలుసని నామ అన్నారు. 70 లక్షల మంది తెలంగాణ రైతులకు ప్రతి ఏటా రైతు బంధు, 24 గంటల ఉచిత విద్యుత్తు సహా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక రకాలుగా సహాయం అందుతోందని, 24 గంటల ఉచిత విద్యుత్తు అందించే రాష్ట్రంలో దేశంలో మరెక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలను చూసి పొరుగు రాష్ట్రాల రైతులు కూడా తమకూ కావాలంటూ ఆందోళనలు చేస్తున్నారని నామ నాగేశ్వర రావు గుర్తుచేశారు. గతంలో ఎన్నో వరదలు వచ్చాయని, ఏ ప్రభుత్వం నుంచీ అందనంత సహాయం ఈ ప్రభుత్వం అందించిందని ప్రజలే చెబుతున్నారని ఆయన తెలిపారు. రైతులకు 3 గంటల ఉచిత విద్యుత్తు చాలు అంటూ అమెరికాలో వ్యాఖ్యానించిన వ్యక్తి ఇక్కడికొచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు.

కేబినెట్ నిర్ణయాలు చూసి కాళ్ల కింద భూమి కదిలింది

కాంగ్రెస్ ఎంపీల ధర్నా, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆరోపణలు రైతులపై ప్రేమతో కాదని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సహా రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలను చూసి కాంగ్రెస్ కాళ్ల కింద భూమి కదులుతోందని బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ వస్తే కరవు వస్తుందని, వర్షాలు పడవని రైతులకు కూడా తెలుసని ఆయనన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించలేదని తమను నిందించే ముందు జాతీయ పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ నేతలు, తమ నేత రాహుల్ గాంధీని ఎందుకు వరద ప్రాంతాలకు తీసుకురాలేదో చెప్పాలని అన్నారు.

రైతులపై కాంగ్రెస్ కపట ప్రేమ – రంజిత్ రెడ్డి

రైతులపై కాంగ్రెస్ ప్రదర్శిస్తున్నది కపట ప్రేమ అని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనంత పంట నష్ట పరిహారాన్ని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని, మూడు గంటల కరెంట్ చాలన్న కాంగ్రెస్‌ను రైతులు ఉరేస్తారని వ్యాఖ్యానించారు. వరద ప్రాంతాల్లో ప్రజలకు అండదండగా ఉన్నది తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగమేనని ఆయన గుర్తుచేశారు. వరదల సమయంలో సీఎం కేసీఆర్ వెళ్తే ప్రజలు ఇబ్బందిపడతారని, ముందు అక్కడ తక్షణ సహాయం అందించడం మీదనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని అన్నారు. ఇంత విపత్తు సంభవించినా ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడకుండా ప్రభుత్వం చూసుకుందని, చాలా ముందుచూపుతో వ్యవహరించిందని అన్నారు. వరద సహాయం గురించి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన కాంగ్రెస్ ఎంపీలు, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదని అన్నారు. ముందు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులకు అందుతున్న సంక్షేమ ఫలాల గురించి తెలుసుకుని, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయాలని అన్నారు. తెలంగాణలో అందుతున్న సహాయంలో కనీసం 10 శాతం కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అందడం లేదని అన్నారు. రైతుల విషయంలో భంగపడ్డ కాంగ్రెస్ నేతలు దురుద్దేశంతోనే ఢిల్లీలో కూర్చుని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

నిర్మాణాత్మక సలహాలు ఇవ్వండి.. మాతో కలిసి పార్లమెంటులో పొట్లాడండి: వద్దిరాజు రవిచంద

వర్షాలు, వరదల నిర్వహణలో చాకచక్యంగా వ్యవహరించి, తక్షణ సహాయం అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అవాకులు చవాకులు పేల్చుతున్నారని కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు, 24 గంటల ఉచిత విద్యుత్తు సహా అనేక రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే.. చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారని అన్నారు. విమర్శలు, సూచనలు నిర్మాణాత్మకంగా ఉండాలని, అవసరమైతే పార్లమెంటుతో కేంద్ర సహాయం కోసం తమతో కలిసి పోరాడాలని కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు.

చరిత్రలో ఎన్నడూ లేనంత అతి భారీ వర్షాల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని, అయినప్పటికీ ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసి సకల సదుపాయాలు కల్పించామని తెలిపారు. గతంలో పునరావాస శిబిరాలకు రావాలంటే ప్రజలు సంకోచించేవారని, ముంపు ప్రాంతాల నుంచి తరలింపు అధికారులకు కష్టంగా ఉండేదని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయం చూసి ముంపు ప్రాంతాల ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని తెలిపారు. ఈ వర్షాలు, వరదలతోనే వదిలేయకుండా దూర దృష్టితో దీర్ఘకాలిక పరిష్కారాల కోసం కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నారని, ఆ క్రమంలోనే ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు మీద రూ. 150 కోట్లతో కరకట్ట నిర్మాణం కోసం ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. కేసీఆర్ మీద విమర్శ అంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టేనని అభివర్ణించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement