Friday, November 22, 2024

ఆమరణ నిరాహారదీక్షకు దిగిన వీహెచ్

కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్దమేనని ఆయన వ్యాఖ్యానించారు. పంజాగుట్ట సెంటర్‌లో తొలగించిన అంబేడ్కర్‌ విగ్రహాన్ని తిరిగి పున:ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు. ఇదే డిమాండుతో అంబర్‌పేట్‌లోని తన నివాసంలో వీహెచ్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసేంతవరకూ తన దీక్ష కొనసాగుతుందని తెలిపారు. ప్రస్తుతం గోషా మహల్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న విగ్రహాన్ని తిరిగి తమకు అప్పగించాలన్నారు. పంజాగుట్ట సర్కిల్‌లో 2019 ఏప్రిల్ 12న తాను అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించానని వీహెచ్ గుర్తుచేశారు. ఆ మరుసటిరోజే ఏప్రిల్ 13న విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి నుంచి విగ్రహాన్ని గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారని… అప్పటినుంచి విగ్రహం అక్కడే ఉందని అన్నారు. ఇంత జరిగినా ప్రభుత్వంలో ఏ ఒక్కరూ మాట్లాడటం లేదని అన్నారు. రాజ్యాంగ నిర్మాతకే తెలంగాణలో దిక్కు లేదని… ఆయన విగ్రహం తిరిగి ఏర్పాటు చేసేంతవరకూ ఆమరణ దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement