న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేసే కసరత్తు కాంగ్రెస్ గురువారం కొనసాగించింది. బుధవారమే కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ నేతలు సమావేశమైనప్పటికీ, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ లోక్‌సభలో మహిళా బిల్లుపై చర్చలో బిజీగా ఉన్నందున హాజరుకాలేదు. కమిటీ సభ్యులు జిగ్నేష్ మేవానీ, బాబా సిద్ధిఖి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, కమిటీ సభ్యులుగా ఉన్న ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కి అభ్యర్థుల ఎంపికపై దాదాపు రెండున్నర గంటల పాటు కుస్తీపట్టారు.
అయితే లోక్‌సభలో ఓటింగ్ కారణంగా సమావేశాన్ని అర్థాంతరంగా ముగించారు. ఈ పరిస్థితుల్లో గురువారం సాయంత్రం కాస్త త్వరగా.. గం. 4.30కు పార్టీ వార్‌రూమ్‌లో స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ సహా నేతలంతా సమావేశమయ్యారు. ఈ సమావేశం అర్థరాత్రి వరకు కొనసాగింది. వివిధ నియోజకవర్గాల్లో పోటీ కోసం పార్టీ దరఖాస్తులు ఆహ్వానించగా 1000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.
వారిలో 119 నియోజకవర్గాలకు 300 మందిని వడపోసిన టీపీసీసీ నాయకత్వం ఆ జాబితాను స్క్రీనింగ్ కమిటీ ముందు పెట్టింది. పార్టీ సీనియర్ నేతలు పోటీ చేసే సుమారు 25-30 నియోజకవర్గాల్లో అభ్యర్థిత్వంపై పోటీ లేదని, మిగతా నియోజకవర్గాల్లో ఇద్దరు నుంచి ముగ్గురు అభ్యర్థిత్వం కోసం గట్టిగా పోటీపడుతున్నారు. ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో ఏకాభిప్రాయం కుదిరితే జాబితా సిద్ధమైనట్టేనని పార్టీ నేతలు చెప్పారు. అభ్యర్థులను ఎంపిక చేసే క్రమంలో పార్టీ సలహాదారు సునీల్ కనుగోలు సహా మరికొన్ని సంస్థలతో జరిపిన సర్వే నివేదికలు, సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకుంటున్నట్టు తెలిసింది.
స్క్రీనింగ్ కమిటీ వడపోసి తయారు చేసిన జాబితాను కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమై పరిశీలిస్తుంది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆమోదం తర్వాత ఏఐసీసీ ఆ జాబితాను విడుదల చేస్తుందని పార్టీవర్గాలు తెలిపాయి. వారం రోజుల వ్యవధిలో కసరత్తు మొత్తం పూర్తి చేసి నెలాఖరులోగా మొత్తం 119 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది.
హస్తినలో ఆశావాహులు.. ఎవరికివారుగా పైరవీలు
గత రెండ్రోజులుగా కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తుండగా.. మరోవైపు ఆశావాహులు హస్తినబాట పట్టారు. అభ్యర్థుల వడపోత కార్యక్రమం జరిగే లోపే తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఎవరికివారుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. అధిష్టానం పెద్దలను కలిసి పైరవీలు చేసుకుంటున్నారు. మల్రెడ్డి రాంరెడ్డి, కైలాశ్ నేత, సర్వే సత్యనారాయణ సహా పలువురు నేతలు ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయంతో పాటు పార్లమెంటులో కనిపించారు.
అధిష్టానం పెద్దలు ఎక్కడుంటే అక్కడికి వెళ్తూ.. తమ సీటు కోసం పైరవీలు చేసుకుంటున్నారు. వాటిలో ఎల్బీనగర్ సీటు ఎవరికి కేటాయిస్తారన్న అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సీటు విషయంలో మల్రెడ్డి రాంరెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. స్క్రీనింగ్ కమిటీలో సభ్యుడిగా కూడా ఉన్న మధుయాష్కి ఆ సీటు విషయంతో గట్టి పట్టుబట్టినట్టు తెలిసింది. అయితే ఈ సీటు విషయంలో తుది నిర్ణయాన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిటీకే వదిలేయాని స్క్రీనింగ్ కమిటీ నేతలు నిర్ణయించినట్టు తెలిసింది.