Saturday, November 23, 2024

ఈడీపై కాంగ్రెస్ నిరసన కొరఢా.. ఈనెల 13న దేశవ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కేసులే లేకుండా విచారణ పేరుతో వేధింపులకు పాల్పడుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్‌ (ఈడీ) అధికారులు ఈ నెల 13న కాంగ్రెస్ నిరసన సెగ ఎదుర్కొంటారని కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహాహారాల ఇంచార్జి మాణిక్యం టాగోర్ అన్నారు. రాహుల్ గాంధీని వేధించడం కోసమే ఈడీ సమన్లు జారీ చేసిందని ఆయన ట్విట్టర్లో ఆరోపించారు. ప్రతిపక్ష నేతలపై దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈనెల 13న అన్ని రాష్ట్రాల్లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) కార్యాలయాల ఎదుట సత్యాగ్రహ దీక్షలు చేపట్టాలని నిర్ణయించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇంచార్జిలు, పీసీసీ అధ్యక్షులతో గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో అధిష్టానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. విచారణకు హాజరుకావాల్సిందిగా సమన్ల మీద సమన్లు జారీ చేస్తుండడంతో ఇదంతా ప్రతిపక్షాలపై కక్షసాధింపు ధోరణేనని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో దర్యాప్తు సంస్థల దుర్వినియోగాన్ని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ శ్రేణులు నిరసన ప్రదర్శనలు చేపట్టాలని నిర్ణయించింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ద్వయం ప్రతిపక్ష నేతలపై సీబీఐ, ఈడీ, ఇన్‌కం ట్యాక్స్ సహా వివిధ కేంద్ర దర్యాప్తు సంస్థలను దురుద్దేశంతో ప్రయోగిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం నిరసన ప్రదర్శనలు చేపట్టాలన్న ప్రతిపాదనకు వర్చువల్ సమావేశానికి హాజరైన నేతలు ముక్తకంఠంతో సమర్థించారు. ఆ ప్రకారం ఈ నెల 13న దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని ఈడీ కార్యాలయాల ఎదుట ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు ఆందోళనలతో సత్యాగ్రహం చేపట్టాలని నిర్ణయించగా, దేశ రాజధాని ఢిల్లీలో ఈడీ ప్రధాన కార్యాలయం వరకు కాంగ్రెస్ ఎంపీలు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement