Tuesday, November 26, 2024

కాంగ్రెస్‌కు పటిష్ట నాయకత్వం అవసరం, సంస్థాగత సమస్యల పరిష్కారానికి సంస్కరణలు కావాలి: పీకే

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కాంగ్రెస్‌లో చేరిక దాదాపు ఖాయమనుకున్న వేళ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అనూహ్యంగా వెనక్కు తగ్గారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఏర్పాటు చేయనున్న ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ – 2024లో చేరడానికి నిరాకరించారు. మంగళవారం మధ్యాహ్నం దాదాపు ఒకే సమయంలో అటు ఏఐసీసీ, ఇటు ప్రశాంత్ కిశోర్ ట్విట్టర్ ద్వారా ప్రకటన చేశారు. తొలుత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ “ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన ప్రజెంటేషన్, ఆ తర్వాత జరిగిన చర్చ అనంతరం కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ – 2024 ఏర్పాటు చేసి, అందులో ఒక నిర్ణీత బాధ్యతలతో బృందంలో ఒకరిగా చేరాలని ఆయన్ను కోరారు. ఆయన నిరాకరించారు. పార్టీ కోసం ఆయన చేసిన సూచనలు, చేసిన ప్రయత్నాలను మేం అభినందిస్తున్నాం” అని పేర్కొన్నారు.

ఈ ట్వీట్ పోస్టు చేసిన కొద్దిసేపట్లోనే ప్రశాంత్ కిశోర్ స్పందించారు. “ఎన్నికల బాధ్యతలు చేపట్టడం కోసం ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్‌లో ఒకరిగా చేరాలన్న కాంగ్రెస్ ఆఫర్‌ను నేను తిరస్కరించాను. నా దృష్టిలో నేను చేరడం కంటే పార్టీకి పటిష్ట నాయకత్వం అవసరం. అలాగే పార్టీలో ఏళ్లతరబడి సంస్థాగతంగా వేళ్లూనుకుపోయిన సంస్థాగత సమస్యలను పరిష్కరించడం కోసం నాయకులంతా కలసికట్టుగా దృఢమైన సంకల్పంతో పనిచేస్తూ సమూల మార్పులు, సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉంది” అని ప్రశాంత్ కిశోర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.

కోరుకున్నదే జరిగిందా?
ప్రశాంత్ కిశోర్ చేరికను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ సీనియర్లు తమ ఎత్తుగడలో విజయం సాధించినట్టే కనిపిస్తోంది. పార్టీలో సమూల మార్పులు అవసరమని చెబుతున్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ను రానిస్తే, తమ ఉనికే ప్రమాదమని వారంతా భావించారు. సంస్థాగతంగా, నిర్మాణపరంగానూ అనేక మార్పులను పీకే తన ప్రజెంటేషన్‌లో సూచించారు. కుటుంబ వారసత్వ రాజకీయాల ముద్రను చెరిపేసుకునే ప్రయత్నం చేయాలని కూడా సూచించారు. ఒకరికి ఒకే పదవి అంటూ ప్రతిపాదించారు. ఇలాంటివన్నీ నిజంగానే అమలైతే ఎంతోమంది సీనియర్ నేతలు రిటైర్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. క్షేత్రస్థాయి పరిస్థితులపై ఏమాత్రం అవగాహన లేనివారు, ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి గెలవలేనివారు అధిష్టానం చుట్టూచేరి పార్టీని తప్పుదారి పట్టిస్తున్నారన్న భావనలో ప్రశాంత్ కిశోర్ ఉన్నారు. పార్టీలో చేరి, సోనియాగాంధీ రాజకీయ సలహాదారుగా వ్యవహరించిన అహ్మద్ పటేల్ తరహాలో కీలకమైన బాధ్యతలు చేపట్టి సంస్కరిద్దామని ఆయన భావించినట్టు తెలిసింది. కానీ బయటినుంచి వచ్చిన వ్యక్తికి ఏకాఏకి అంత కీలక బాధ్యతలు అప్పగిస్తే, గాంధీ కుటుంబం ప్రతిష్ట మసకబారుతుందని, పార్టీని పూర్తిగా పీకే హైజాక్ చేసే ప్రమాదం ఉందని సీనియర్ నేతలు అధినేత్రి సోనియా గాంధీ దగ్గర ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది.

పైగా రాజకీయ పార్టీలతోనే వ్యాపారం చేసే ప్రశాంత్ కిశోర్‌ను ఎంతవరకు నమ్మగలం అన్న సందేహాలను కూడా వ్యక్తపరిచారు. తొలుత పీకేను బృందంలో ఒక సభ్యుడిగా తీసుకుని, కొన్నాళ్లు పరిశీలించిన తర్వాత బాధ్యతలు అప్పగించడం మేలని సూచించారు. ఫలితంగా ప్రశాంత్ కిశోర్‌ను చేర్చుకుని కీలక బాధ్యతలు అప్పగించాలన్న ఆలోచనను విరమించుకున్న అధినేత్రి సోనియా గాంధీ, ‘ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ – 2024’ను ఏర్పాటు చేసి, అందులో ఒకరిగా చేరాలని ప్రశాంత్ కిశోర్‌కు ఆఫర్ ఇచ్చారు.

అయితే పార్టీలో చేరి గుంపులో గోవిందయ్యలా ఉండడం కంటే, చేరకపోవడమే ఉత్తమం అని పీకే నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అందుకే, వందేళ్లకు పైగా చరిత్రకల్గిన పార్టీయే స్వయంగా ఆహ్వానం పంపినా, ఆయన నిర్మొహమాటంగా తిరస్కరించారు. అయితే తిరస్కరిస్తున్న విషయం చెబుతూనే పార్టీ లోపాలను మరోసారి ఎత్తిచూపారు. పార్టీకి పటిష్టమైన నాయకత్వం లేదని ఆయన తన ట్వీట్ ద్వారా సూటిగా చెప్పేశారు. నేతల్లో ధృడసంకల్పం, ఐకమత్యం లేదని కూడా ప్రశాంత్ కిశోర్ ఘాటు విమర్శలు చేశారు. పార్టీలో సమస్యలు మర్రిచెట్టు వేళ్లలా బలంగా పాతుకుపోయాయని, వాటిని పరిష్కరించడం కోసం సమూల ప్రక్షాళన చేపట్టాల్సిన అవసరం ఉందని తేల్చిచెప్పారు. ఇప్పటికీ పార్టీ వైఖరిలో మార్పు రాకపోతే, మార్పు ఎప్పటికీ కష్టమే అన్న సంకేతాలిచ్చారు. ఈ విమర్శల సంగతెలా ఉన్నా, కాంగ్రెస్‌లో చేరకుండా ఆ పార్టీకి తన వ్యూహాలతో సహకరిస్తారా.. లేదా ఐ-ప్యాక్ సంస్థ ద్వారా వ్యాపారం చేస్తారా అన్న విషయంలో మాత్రం స్పష్టతనివ్వలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement