కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ సీనియర్ నేత కిషన్‌రెడ్డిపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్ల కోసం బీసీ కులాల మధ్య కిషన్‌రెడ్డి చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, బీజేపీ నాయకులను టీఆర్ఎస్‌లో చేర్పించారని ఆరోపించారు. సాగర్‌లో టీఆర్ఎస్‌కు బీజేపీ మద్దతు పలుకుతోందని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కిషన్ రెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ ఆదేశాల మేరకే రవి నాయక్‌కు బీజేపీ బీఫారం ఇచ్చారని, సాగర్‌లో బీజేపీకి డిపాజిట్ రాదని, రవినాయక్ ద్వారా కాంగ్రెస్ ఓట్లు చీల్చే కుట్ర చేశారని తెలిపారు. బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు అందరికీ తెలుసని, రవినాయక్‌కు బీజేపీకి ఏం సంబంధం లేదని, ఓట్లు చీల్చేందుకు బయటకి వ్యక్తికి టికెట్ ఇచ్చారని చెప్పారు. నమ్మకద్రోహం, మిత్రద్రోహుల సంఘానికి అధ్యక్షుడు కేసీఆర్ అని, యూనివర్సిటీకి వచ్చే దమ్ము ధైర్యం బాల్క సుమన్‌కు ఉందా అని ప్రశ్నించారు.
అటు తమ పార్టీ అభ్యర్థి జానారెడ్డి సవాల్‌ను ఎందుకు స్వీకరించలేదో హాలియా బహిరంగ సభలో సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఏకగ్రీవం సాంప్రదాయాలను తుంగలో తొక్కిందే కేసీఆర్ అని, సాగర్‌లో ఓట్లు అడిగే నైతిక హక్కు కేసీఆర్‌కు ఉందా అని ప్రశ్నించారు.