న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని మటాష్ చేస్తారని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ రావు అన్నారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని తన వ్యక్తిగత పార్టీగా మార్చారని అన్నారు. ఓవైపు సమైక్యవాదులను పార్టీలో చేర్చుకుంటూ వైఎస్ షర్మిలపై సమైక్య ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరి తెలంగాణ నుంచి పోటీ చేయాలని అనుకున్నారని, కానీ ఆమె చేరికను రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నారని విమర్శించారు.
ఇందుకు రేవంత్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్య వాదం వినిపించిన తుమ్మల నాగేశ్వర రావు, మండవ వెంకటేశ్వర రావు, సీతా దయాకర్ రెడ్డి వంటి వారిని ఎలా పార్టీలో చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. సమైక్యవాదమే తమ విధానమని ప్రకటించిన సీపీఐ(ఎం)ను ఎందుకు దగ్గర తీసుకుంటున్నారని నిలదీశారు.
మరోవైపు జమిలి ఎన్నికల గురించి మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తిస్థాయి జమిలి ఎన్నికలు సాధ్యపడవని అన్నారు. అయితే మినీ జమిలికి మాత్రం ఆస్కారం ఉందని తెలిపారు. పదవీకాలం పూర్తయిన ప్రభుత్వాలకు ఒక్క నిమిషం కూడా గడువు పెంచడానికి ఆస్కారం లేదని అన్నారు. తెలంగాణలో జనవరి 15న గం. 11.59 నిమిషాల్లోపు కొత్త ప్రభుత్వం కొలువుతీరాల్సిందేనని అన్నారు.
ఒక గంట పొడిగించాలన్నా సరే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని, గతంలో 1971లో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ పెట్టి పార్లమెంట్, అసెంబ్లీల పరిధి ఆరేళ్లకు పెంచిందని గుర్తుచేశారు. అప్పుడు ఆర్డినెన్స్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గడువు పెంచిందని తెలిపారు. రాజ్యాంగ సవరణ చేయాలంటే మూడింట రెండొంతుల మెజారిటీ ఉండాలని, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆమోదించాల్సి ఉంటుందని అన్నారు. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ నేతలు జమిలి ఎన్నికల పేరుతో ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడు అరెస్టుపై తాను మంగళవారం చేసిన వ్యాఖ్యలను సవరించుకుంటూ బుధవారం వివరణ ఇచ్చారు. చరిత్రలో హౌజ్ రిమాండ్ ఇచ్చిన ఉదంతాలు లేవని చెప్పానని, కానీ తర్వాత తెలుసుకుంటే 2021లో మహారాష్ట్రలో ఒక జర్నలిస్టుకు, పశ్చిమ బెంగాల్లో ముగ్గురు రాజకీయ నాయకులకు హౌజ్ రిమాండ్ ఇచ్చారని తెలిపారు. ఈ ఘటనలను ఉదహరించి కోర్టులో చంద్రబాబుకు కూడా హౌజ్ రిమాండ్ కోరవచ్చని తెలిపారు. జైళ్లలో రాజకీయ ఖైదీలకు ప్రత్యేక సెల్‌తో పాటు ప్రత్యేక సదుపాయాలు ఉంటాయని చెప్పారు.
అయితే జైలర్లు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తార కాబట్టి చంద్రబాబుకు జైల్లో ప్రాణహానికి అవకాశం ఉందని తెలిపారు. బయట నుంచి ఆహారం తీసుకెళ్లినా సరే.. మార్గ మధ్యలో అందులో విషం కలిపే అవకాశం లేకపోలేదని వ్యాఖ్యానించారు. జగన్ దేనికైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. ఏ సర్వేలు చూసిన జగన్ కచ్చితంగా ఓడిపోతారని చెబుతున్నాయని, తెలుగుదేశం పార్టీకి 88 కంటే ఎక్కువ సీట్లు రావడం ఖాయమని అన్నారు. పవన్ కళ్యాణ్ కూడా కలిస్తే 130 సీట్లు వస్తాయని చెప్పారు.
బాబు అరెస్టుతో తమ పని అయిపోయిందని వైఎస్సార్సీపీ నేతలు స్వయంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని గోనె ప్రకాశ రావు అన్నారు. చంద్రబాబును అరెస్టు చేయడం తెలుగు ప్రజలకు చీకటి రోజుగా ఆయన అభివర్ణించారు. చంద్రబాబుపై పెట్టిన కేసుల్లో విషయం ఏమీ లేదని, జగన్ మీద ఉన్న కేసులు అలా కాదని పోలిక తీసుకొచ్చారు. ఇప్పటికైనా జగన్ మారాలని, లేదంటే తన వెంట ఉన్నవాళ్లంతా చెట్లు, పుట్టలు పట్టుకుని వెళ్లిపోవడం ఖాయమని అన్నారు. జగన్ చర్యల కారణంగా జగన్ మాత్రమే కాదు, ఆయన వెంట ఉన్నవాళ్లు కూడా నష్టపోతారని అన్నారు.