కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సోమవారం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ వద్ద నిరసన తెలిపింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ట్రాక్టర్ నడిపి వినూత్న నిరసన తెలిపారు. పార్లమెంట్‌కు తాను రైతుల సందేశాన్ని తీసుకువచానని, ప్రభుత్వం రైతుల గొంతును నొక్కేస్తోందని రాహుల్ ఆరోపించారు. రైతుల న్యాయపరమైన డిమాండ్లపై సభలో చర్చ జరగకుండా మోదీ ప్రభుత్వం అడ్డుకుంటోందని రాహుల్ మండిపడ్డారు.
కేంద్రం తెచ్చిన నల్ల చట్టాలను కేంద్రం రద్దు చేయాల్సిందేనని, ఇవి కేవలం ఇద్దరు, ముగ్గురు బడా వ్యక్తుల ప్రయోజనానికే అన్న విషయం దేశానికి తెలుసునని ఆయన చెప్పారు. అన్నదాతలు సంతోషంగా ఉన్నారని ప్రభుత్వం అభివర్ణిస్తోందని.. మరోవైపు పార్లమెంటు బయట నిరసన పాటిస్తున్నవారిని టెర్రరిస్టులు అంటూ ఆరోపిస్తుందని విమర్శించారు. ఇదెక్కడి న్యాయం అని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని ఆయన దుయ్యబట్టారు.
ఈ వార్త కూడా చదవండి: తెలంగాణలో కొత్త రాజకీయ చదరంగం