Tuesday, November 26, 2024

Sad News | కాంగ్రెస్ నేత‌, కేర‌ళ మాజీ సీఎం ఊమెన్ చాందీ ఇక‌లేరు..

కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ (79) అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుమారుడు తెలిపారు. ఊమెన్ చాందీ గతంలో గొంతు సమస్యతో బాధ‌ప‌డుతూ ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అనంతరం, మెరుగైన చికిత్స కోసం మరో ప్రైవేటు హాస్పిట‌ల్‌లో చేరారు. వరుసగా 12 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఊమెన్ చాందీ 1943 అక్టోబర్ 31న కొట్టాయం జిల్లాలోని కుమరకోమ్ గ్రామంలో జన్మించారు.

సాధారణ కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఊమెన్ చాందీ అంచెలంచెలుగా ఎదిగారు. నిజాయితీ, నిబద్ధత గల వ్యక్తిత్వంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సన్నిహితుడిగా మారారు. 1970లో చాందీ తనకు 27 ఏళ్ల వయసులో తొలిసారిగా పూతుపల్లి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. అది మొదలు ఆయన విజయయాత్ర అప్రతిహతంగా కొన‌సాగింది. అదే నియోజకవర్గానికి ఏకంగా 12 సార్లు ఎమ్మెల్యేగా సేవలందించారు. 1977లో కె.కరుణాకరన్ కేబినెట్‌లో తొలిసారిగా చాందీకి మంత్రి పదవి దక్కింది. 2004-06, 2011-16 మధ్య కాలంలో ఆయనను సీఎం పీఠం దక్కింది. కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇన్‌చార్జిగా కొంత‌కాలం తెలంగాణ‌కు కూడా త‌న సేవ‌లందించారు.

- Advertisement -

ఊమెన్ రాజ‌కీయ నేప‌థ్యం..

ఊమెన్ చాందీ కేరళ ముఖ్యమంత్రిగా రెండుసార్లు పనిచేశారు – 2004-06, 2011-16 స‌మ‌యంలో ఆయ‌న సీఎంగా ప‌నిచేశారు. అనుభవజ్ఞుడైన కాంగ్రెస్ నాయకుడిగా 27 సంవత్సరాల వయస్సులో 1970 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో గెలుపొందడం ద్వారా శాసనసభ్యుడిగా రాజ‌కీయాల్లో త‌న ఉనికిని చాటుకున్నారు. ఆ తర్వాత అతను 12సార్లు వరుస ఎన్నికల్లో విజయం సాధించారు.

గత ఐదు దశాబ్దాలుగా చాందీ తన సొంత నియోజకవర్గం పుతుపల్లికి మాత్రమే ప్రాతినిధ్యం వహించారు.
2022లో, 18,728 రోజుల పాటు సభలో పుత్తుపల్లికి ప్రాతినిధ్యం వహించడం ద్వారా రాష్ట్ర అసెంబ్లీలో ఎక్కువ కాలం పనిచేసిన సభ్యుడిగా రికార్డు సాధించారు. కేరళ కాంగ్రెస్ (ఎం) మాజీ అగ్రనేత దివంగత కేఎం మణి రికార్డును ఆయన అధిగమించారు. ఇక‌.. చాందీ తన రాజకీయ జీవితంలో వివిధ కేయాబినెట్‌లలో నాలుగుసార్లు మంత్రిగా, నాలుగుసార్లు రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement