Wednesday, January 15, 2025

Delhi | రాజ్యాంగాన్ని కాపాడే ఏకైక పార్టీ కాంగ్రెస్.. రాహుల్ గాంధీ

న్యూ ఢిల్లీ – కాంగ్రెస్ భావజాలంలో పెద్ద, చిన్న కులాలు, తర తమ బేధాలు ఉండవని, రాజ్యాంగంలో అదే రాసి ఉందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్‌లో పూర్తిగా కేంద్రీకృతమైన విధానాలు, నిర్ణయాలు ఉంటాయన్నారు. రాజ్యాంగం చెల్లుబాటు కాదని మోహన్ భగవత్ చెబుతున్నారని, బ్రిటీష్ మీద జరిగిన పోరాటాన్ని గుర్తించడం లేదని ఆర్ఎస్ఎస్ తీరును విమర్శించారు.

కొత్త ఢిల్లీలోని కోట్లా రోడ్డులో నూతనంగా నిర్మించిన ఆరు అంతస్థుల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ కాంగ్రెస్ నేత సోనియా గాంధీ నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ కార్యాల‌య భ‌వ‌నానికి ఇందిర భ‌వ‌న్ గా నామ‌క‌ర‌ణం చేశారు.

ఈ సంద‌ర్బంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ… ఆర్ఎస్ఎస్ విధానాలు పాటిస్తున్న బీజేపీకి త్రివర్ణ పతాకంపై గౌరవం లేదని, రాజ్యాంగ విలువలపై నమ్మకం లేదన్నారు. రాజ్యాంగాన్ని కాపాడే ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీయేనని రాహుల్ అన్నారు. కాంగ్రెస్ భావజాలం ఇవాళ్టిదో.. నిన్నటిదో కాదని.. వేల సంవత్సరాల ఆర్ఎస్ఎస్ ఐడియాలజీని వ్యతిరేకిస్తూ వేల ఏళ్లుగా మా ఐడియాలజీ కొనసాగుతూ వచ్చిందన్నారు.

- Advertisement -

గురునానక్, గౌతమ బుద్ధుడు, కృష్ణుడు.. వీళ్లంతా ఆర్ఎస్ఎస్ ఐడియాలజీనా.. అని ప్రశ్నించారు. ఈ కొత్త భవనం కాంగ్రెస్ భావజాలానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఈ భవనంలో ఉన్న అందరూ ఆ భావజాలాన్ని కాపాడేవారేనని బీజేపీకి లొంగిపోయేవారు కాదని అన్నారు. ఈ భవంతి బయట మిలియన్ల కొద్దీ ప్రజలు మన భావజాలానికి మద్దతుగా ఉన్నారని, ఈ భావజాలం దేశం నలుమూలలకు మరింతగా విస్తరించాలని రాహుల్ గాంధీ పిలుపిచ్చారు. ఈ కొత్త కార్యాల‌యం కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల ర‌క్తంతో నిర్మించామ‌ని, ఇందులో ప్ర‌తిఒక్క కాంగ్రెస్ వాదికి భాగం ఉంద‌ని అన్నారు రాహుల్.

Advertisement

తాజా వార్తలు

Advertisement