నిర్మల్ ప్రతినిధి, జులై 19 (ప్రభ న్యూస్) : రైతులకు ప్రథమ శత్రువు కాంగ్రెస్సేనని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నేతృత్వంలో సోన్ మండల కేంద్రంలోని రైతు వేదికలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ…. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో రైతులకు సీఎం కేసీఆర్ అండగా నిలిస్తే..కాంగ్రెస్ పార్టీ మాత్రం రైతులకు 3గంటలు కరెంట్ చాలు అంటుందన్నారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉండటం కాంగ్రెస్‌కు కడుపు మంటగా ఉందన్నారు. గతంలో లాగా కరెంట్ సమస్యలు కానీ, విద్యుత్ ట్రాన్స్ ఫార్మార్ల సమస్యలు లేవన్నారు. వ్యవసాయానికి సాగునీరు, నిరంతర నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతు సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్ర రైతన్నల మోహంలో నవ్వు కనపడుతున్నది.వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలు అన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మతిభ్రమించింది. ఆయనకు రైతు కష్టాలు ఏం తెలుసు. వ్యవసాయంపై రేవంత్ రెడ్డిది అవగాహన రాహిత్యమన్నారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ఆర్థికంగా చితికిపోయిన రైతన్నల ఆత్మహత్యలు చూశాం. స్వరాష్ట్రంలో వ్యవసాయం లాభసాటిగా మారింది. రైతు ఆత్మహత్యలు లేవు..వలసలు లేవు. 3 గంటల కరెంట్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ కావాల్నా..3 పంటలకు సాగునీరు, కరెంట్ ఇస్తున్న బీఆర్ఎస్ కావాల్నా రైతులు నిర్ణయించుకోవాలన్నారు.