న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కేంద్రప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం గురించి కాంగ్రెస్ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని బీజేపీ సీనియర్ నేత భానుప్రకాష్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన న్యూఢిల్లీలోని తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ భవన్లో మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి దేశ భద్రత గురించి మాట్లాడడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. బెయిల్ మీద బయట తిరుగుతున్న రేవంత్ కేంద్రప్రభుత్వ విషయాలు మాట్లాడ్డం తగదని హితవు భానుప్రకాష్ పలికారు. దేశభద్రత విషయంలో కేంద్రం రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఓటుకు నోటు కేసులో నిందితులుగా ఉన్న రేవంత్, నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పెద్దలకు అగ్నిపథ్‌పై మాట్లాడే హక్కు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి దేశంలో అడ్రస్ లేకుండాపోతోంందన్న ఆయన, భవిష్యత్‌లో ప్రజలకు ఇంకా దూరమవుతారని జోస్యం చెప్పారు.
అనంతరం భానుప్రకాష్ ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితులపై మాట్లాడుతూ… రాష్ట్రంలో సంక్షేమం పేరుతో సంక్షోభంలోకి నెడుతున్నారని విమర్శించారు. అభివృద్ధి లేని సంక్షేమంతో నష్టమే ఎక్కువ జరుగుతోందని అభిప్రాయపడ్డారు. తనకు ప్రభుత్వం ఇచ్చే డబ్బు కంటే రోడ్లు బాగా లేకపోవడం వల్ల అయ్యే ఖర్చే ఎక్కువని ఓ ఆటోడ్రైవర్ చెప్పుకొచ్చాడని ఆయన ఉదహరించారు. గతంలో రోజుకు 10-15 ట్రిప్స్ వేసుకునే తాను రోడ్ల కారణంగా 3-4 ట్రిప్స్‌కి మించి తిరగలేకపోతున్నానని, పైగా గతుకుల రోడ్ల వల్ల పెట్రోల్ ఖర్చు పెరుగుతోందని వాపోయాడని భానుప్రకాష్ తెలిపారు. తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చుంటే ప్రజల కష్టాలు తెలియవని ఎద్దేవా చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మద్యాన్ని కూడా తాకట్టు పెట్టిన ఘనత ఏపీ ప్రభుత్వానిదని ఆరోపించారు.
ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కారును కోరుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. ఆత్మకూరులో గతం కంటే తమ బలం బాగా పెరిగిందని చెప్పారు. రానున్న రోజుల్లో మరింత బలపడి అధికారం సాధించే దిశగా ముందుకెళ్తామని భానుప్రకాష్ ధీమా వ్యక్తం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.