న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతికి, దోపిడీకి గ్యారంటీ అని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) డా. కే. లక్ష్మణ్ అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అంటే అభివృద్ధికి, పేదల సంక్షేమానికి గ్యారంటీ అని ఆయన వ్యాఖ్యానించారు. ఆదివారం ఢిల్లీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జార్ఖండ్‌లో కాంగ్రెస్ నేత ధీరజ్ సాహు నివాసంలో బయటపడ్డ కోట్లాది రూపాయల నోట్ల కట్టల గురించి వివరించారు. విచ్ఛిన్నకర రాజకీయాలకు కాంగ్రెస్ చిరునామాగా మారిందని అన్నారు.
సాహు నివాసంలో దొరికిన నగదును లెక్కించే మెషీన్లు సైతం పాడైపోయాయని, 5 రోజులుగా లెక్కించే పని కొనసాగుతోందని చెప్పారు. ఇప్పటి వరకు రూ. 300 కోట్లు లెక్కించగలిగారని, ఇంకా లెక్కించాల్సింది చాలా ఉందని తెలిపారు. సాహు కాంగ్రెస్ పార్టీ తరఫున మూడు పర్యాయాలు రాజ్యసభకు ఎన్నికయ్యారని, ఇలాంటి అవినీతిపరులకు కాంగ్రెస్ కొమ్ముకాస్తోందని ఆరోపించారు. ఎందుకంటే సాహు వంటి నేతలు కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంలా మారారని విమర్శించారు.
ధీరజ్ సాహు వ్యవహారంపై ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ ఎవరూ మాట్లాడడం లేదని డా. లక్ష్మణ్ అన్నారు. యూపీఏ హయాంలో రూ. 12 లక్షల కోట్ల విలువైన కుంభకోణాలు జరిగాయని దుయ్యబట్టారు. విపక్ష కూటమి (ఇండియా) నేతల అవినీతిని వెలికి తీస్తుంటే దర్యాప్తు సంస్థలపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. అవినీతి పరులు తిన్న సొమ్మంతా ప్రధాని మోడీ కక్కిస్తారని లక్ష్మణ్ అన్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో కుంభకోణాలు పెరిగిపోయాయని ఆరోపించారు.
చిన్న అవినీతి ఆరోపణ కూడా లేకుండా ప్రధాని మోడీ పాలన అందిస్తుంటే ప్రతిపక్షాలు సహించలేకపోతున్నాయని వ్యాఖ్యానించారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రజలు మోడీకి బ్రహ్మరథం పడుతున్నారని, 2024లో మరోసారి బీజేపీ గెలుపొంది మోడీ మూడో పర్యాయం ప్రధాని కావడం ఖాయమని డా. కే. లక్ష్మణ్ అన్నారు. అంతేకాదు, మోడీ నేతృత్వంలో భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కూడా ఎదుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అవినీతిపరులకు ప్రజలు బుద్ధి చెప్పాలని లక్ష్మణ్ అన్నారు.
మధ్యప్రదేశ్‌పై నేడో రేపో నిర్ణయం
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంపికపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం వెలువడుతుందని డా. లక్ష్మణ్ చెప్పారు. ప్రజాస్వామ్యయుతంగా ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకుని, ఆ ప్రకారం పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. సిట్టింగ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కొనసాగించాలా లేదా కొత్త వ్యక్తిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలా అన్న విషయం కూడా ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
రాష్ట్రంలో సీనియర్ నేతలు కైలాశ్ విజయవర్ఘీయ, నరేంద్ర సింగ్ తోమర్ సహా మరికొందరు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలుపొందారని, సీఎం రేసులో వారు కూడా ఉంటారన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ అంతిమంగా పార్టీ నిర్ణయం మేరకు ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. పార్టీ అవసరాల కోసం కొందరు నేతలను కేంద్రం నుంచి రాష్ట్రాలకు, ప్రభుత్వం నుంచి పార్టీకి, రాష్ట్రం నుంచి కేంద్రానికి మార్చుతూ ఉంటుందని లక్ష్మణ్ తెలిపారు. ఎవరికి ఏ బాధ్యత అప్పగించినా క్రమశిక్షణ కల్గిన సైనికుల మాదిరిగా పనిచేస్తారని తెలిపారు.
మజ్లిస్‌ను మచ్చిక చేసుకునేందుకే
సీనియర్ శాసనసభ్యులను ప్రొటెం స్పీకర్‌గా నియమించాలన్న సాంప్రదాయాన్ని పక్కనపెట్టి మజ్లిస్ పార్టీని మచ్చిక చేసుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ అక్బరుద్దీన్ ఓవైసీని ఆ సీటుపై కూర్చోబెట్టిందని ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ప్రభుత్వం ఎవరి పేరును సిఫార్సు చేస్తే గవర్నర్ వారిని ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తారని తెలిపారు. అక్బరుద్దీన్ కంటే సీనియర్లు ఎన్నికైన ఎమ్మెల్యేల్లో ఉన్నప్పటికీ కాంగ్రెస్ రాజకీయం చేసిందని అన్నారు. అందుకే బీజేపీ ఈ చర్యను వ్యతిరేకించిందని తెలిపారు.