Sunday, November 24, 2024

TG: కార్మికుల‌కు బోన‌స్ ఇచ్చింది కాంగ్రెస్‌.. ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి

కార్మికుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వడమే లక్ష్యం
పింఛ‌న్ దారుల‌కు న్యాయం చేస్తా
బొగ్గు ఉత్ప‌త్తి ఖ‌ర్చు త‌గ్గించండి
ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను కాపాడుకోవాలి
ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : సింగ‌రేణిని బీఆర్ఎస్ నిర్వీర్యం చేసింద‌ని, కార్మికుల భ‌విష్య‌త్తుకు భ‌రోసా ఇవ్వ‌డ‌మే త‌మ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. సోమ‌వారం ప్రజాభవన్​ లో సింగరేణి కార్మికులకు బోనస్​ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… కాంగ్రెస్ ​ప్రభుత్వం ప్రకటనలే పరిమితం కాకుండా సింగరేణిలో వచ్చిన లాభాల్లో కార్మికులకు బోనస్​ ను పండుగ కంటే ముందే ఇచ్చామన్నారు. సింగరేణి కార్మికుల అన్ని అవసరాలను తీరుస్తామ‌న్నారు.

సింగ‌రేణి సంస్థ కార్మికుల ఆస్తి …
సింగరేణి సంస్థ కార్మికులదని, సింగరేణి ఆస్తి కార్మికులదని, కేవలం వాళ్లని నిలబెట్టి ముందుకు తీసుకెళ్లే బాధ్యత మాత్రమే ప్రభుత్వానిదని డిప్యూట సీఎం అన్నారు. సింగరేణిని కాపాడుకుంటూ సంస్థ ఆధీనంలోని ఒక్క మైన్‌ని కూడా బయటకు పోకుండా చూసే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. కార్మికులను నిలబట్టడానికి ఏం చేయడానికైనా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అవసరమైతే కేంద్రంతో కూడా మాట్లాడతామని హామీ ఇచ్చారు. అనంతరం కార్మికులకు చెక్కుల పంపిణీ చేశారు.

ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను కాపాడుకోవాలి…
ప్రభుత్వ రంగ సంస్థలకు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంద‌ని భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని… కాంగ్రెస్​ ప్రభుత్వం రూ. 400 కోట్లు ఇచ్చి జీవం పోషించింద‌ని చెప్పారు. కార్మికులకు వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంద‌ని చెప్పారు. కార్మికుల అభివృద్దికి కాంగ్రెస్​ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వం అరకొరగా పంచితే.. కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చిన లాభాలను అధికారికంగా ప్రకటించింద‌ని చెప్పారు. కార్మికుల అభివృద్దికి ఎంత కేటాయిస్తున్నామో ప‌బ్లిక్‌గా చెప్పామ‌న్నారు. సింగ‌రేణి బొగ్గు త‌వ్వ‌కాల ఖ‌ర్చు త‌గ్గించాల‌ని సూచించారు.

- Advertisement -

ప్ర‌తి బొగ్గు బావి ద‌గ్గ‌ర ద‌స‌రా…
ప్రతి బొగ్గు బావి దగ్గర దసరా పండుగ నిర్వ‌హించాల‌ని, ముందుగా కార్మికులకు విందు ఏర్పాటు చేయాలని సింగరేణి జీఎంను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. సింగరేణి భవిష్యత్తును నిర్ణయించే అధికారం కార్మికులదేనన్నారు. కాంట్రాక్ట్​ కార్మికుల శ్రమ దోపిడీ జరుగుతుందంటూ… వారి జీతాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సింగరేణి సెగ్మంట్​లలో పైలట్​ ప్రాజెక్ట్​ యంగ్​ ఇండియా స్కూల్స్​ను ప్రారంభిస్తామన్నారు. సింగరేణిలో పదవీ విరమణ పొందిన కార్మికుల పెన్షన్​ విషయాన్ని పరిశీలించి వారికి కూడా న్యాయం చేస్తామన్నారు.

కార్మికులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం: మంత్రి పొంగులేటి…
ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత సింగరేణి సంస్థ మొట్టమొదటిసారిగా అత్యధిక బొగ్గు ఉత్పత్తితోపాటు అత్యధిక లాభాలను కూడా గడించడం హర్షించదగిన విషయమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక పక్షపాత ప్రభుత్వం అని, కార్మికులందరికీ కచ్చితంగా అండగా ఉంటుందని చెప్పారు. సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమం సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పెద్దమనస్సుతో కష్టపడిన కార్మికులకు బోనస్ ప్రకటించడం, కాంట్రాక్ట్ కార్మికులకు కూడా తొలిసారి బోనస్ అందించడం గొప్ప విషయం అన్నారు.

సింగ‌రేణి కార్మికుల కోసం ఎన్నో చేయాలి…
సింగరేణి గనులు ఉన్నచోట‌ హాస్పిటల్స్‌లో కనీస వ‌స‌తులు లేవని, ఇది బాధాకరమని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ అన్నారు. సింగరేణి ఉద్యోగుల కోసమే కాకుండా మైన్స్ ఉన్న ప్రాంతంలో అత్యాధునిక‌ వైద్య సేవలను అందించేలా కార్పొరేట్ హాస్పిటల్స్ కట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని అన్నారు. హైదరాబాద్‌లోని టాప్ ఎడ్యుకేషన్ ను సింగరేణి కార్మికుల పిల్లలకు కూడా అందించాల్సి ఉందని చెప్పారు. కార్మికులకు ఇళ్లు అందించే దిశగా మంత్రి మండలిలో మాట్లాడి అతి త్వరలో కార్మికులకు తీపికబురు అందిస్తామని హామీ ఇచ్చారు. సింగరేణి ఉత్పత్తిని గణనీయంగా పెంచి భారీ లాభాలు గడించేందుకు అన్ని రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం కృష్టి చేస్తుందని పొంగులేటి భరోసా ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement