న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలోని రైతులను ఏకం చేస్తూ ఇతర వర్గాలతో కలిసి ముందుకు వెళ్లడంపై రాహుల్ గాంధీతో చర్చించానని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు. అనంతరం న్యూఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంపై రాహుల్‌గాంధీ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని చెప్పారు. వరంగల్ రైతు డిక్లరేషన్ తర్వాత మంచి వాతావరణం ఏర్పడిందని, రాష్ట్రంలోని రైతులు ఎంతో నిరుత్సాహంతో ఉన్నారని మధు యాష్కీ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని బలహీన వర్గాలన్నీ కాంగ్రెస్ పార్టీ వైపు ఉండడం వల్లే 2004, 2009లో అధికారంలోకి రాగలిగామన్న విషయాన్ని రాహుల్‌కు గుర్తు చేశానన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీసీ, రెడ్డి సామాజిక వర్గానికి అవకాశమిచ్చినా కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడానికి గల కారణాలతో పాటు రాబోయే రోజుల్లో గెలవాలంటే ఏ విధంగా పని చేయాలన్న అంశాలపై చర్చించానని వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు గొర్రెలు, బర్రెలు, చేపలు ఇస్తూ వారిని కులవృత్తులకే పరిమితం చేస్తూ చదువుకు దూరం చేసే కుట్ర జరుగుతోందని మధుయాష్కీ ఆరోపించారు.
ఈ కారణంగా వారంతా తిరిగి కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని, వారిని కలుపుకొని ముందుకు వెళ్ళినప్పుడే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుందన్న అంశాన్ని రాహుల్ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. బీజేపీ తెలంగాణలో బలహీన వర్గాలను ఆకట్టుకోవడానికి అనుసరిస్తున్న విధానాలు, బీసీ నాయకుణ్ని ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేట్ చేసిన విషయంపై కూడా రాహుల్‌తో చర్చ జరిగిందన్నారు. అంతేగాక తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎంలు కలిసి పని చేస్తున్నాయన్న ఆయన, వారిని ఎదుర్కొని కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కష్టపడి పని చేయాలని సూచించారు. అందుకు అవసరమైన వ్యూహం, కేంద్ర నాయకత్వం నుంచి నిరంతర పరిశీలన ఉండాల్సిన అవసరం ఉందని రాహుల్‌కి తెలిపానన్నారు. పార్టీలో రాష్ట్ర స్థాయి నాయకుల మధ్య ఉన్న మనస్పర్థల విషయం అధిష్టానానికి తెలుసునని, అవసరమైనప్పుడు తగిన చర్యలు తీసుకుంటారని మధుయాష్కీ వ్యాఖ్యానించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.