Saturday, November 23, 2024

రేపే కాంగ్రెస్ దళిత గిరిజన దండోరా.. లక్షమందితో భారీ సభ

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గిరిజన, దళిత ఆత్మగౌవర దండోరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. సోమవారం ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో దళిత ఆత్మగౌరవ దండోరా సభ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కాంగ్రెస్ శ్రేణులు పూర్తి చేశాయి. ఈ సభను విజయవంతం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. దండోరా సభకు లక్ష మందికి ఒక్కరు తక్కువైనా సీఎం కేసీఆర్‌కు గులాంగిరీ చేస్తామని ఇప్పటికే రేవంత్ ప్రకటించారు. తుడుం దెబ్బ అంటే ఉడుము పట్టేనని నిరూపిస్తామన్నారు. కొమరంభీమ్‌ స్ఫూర్తితో మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎన్ని నిర్బంధాలు విధించినా లక్ష మందితో ఇంద్రవెల్లిలో సభ పెట్టి తీరుతామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పై పోరాటం చేసేందుకు తెలంగాణ సమాజమంతా కదిలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. కేసీఆర్ ఏడున్నరేళ్ల పాలనలో దళితులు, గిరిజనులకు జరిగిన మోసాలను ఎండగట్టేందుకే ఈ దళిత దండోరా సభను నిర్వహిస్తున్నామని చెప్పారు.

రేపు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్న సభకు ప్రజలను పెద్ద సంఖ్యలో తరలించి, సభను విజయవంతం చేసేందుకు పార్టీ కార్యకర్తలంతా అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. ఆగస్ట్ 9 నుంచి సెప్టెంబరు 17వరకూ జరిగే దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరాలో ఏదో ఒకరోజున కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పాల్గొనే అవకాశం ఉంది. వరంగల్‌ను రాహుల్‌ సభకు ఎంచుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఆ సభలోనే హుజూరాబాద్‌ అభ్యర్థిని ప్రకటించవచ్చని తెలుస్తోంది. రాహుల్‌గాంధీ 5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కేసీఆర్ అరాచక నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగానే దళిత,గిరిజన ఆత్మగౌరవ దండోరా జరుపుతున్నామని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ ఎన్నికల్లో దళిత, గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శిస్తున్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, మూడెకరాల భూమి ,ఉద్యోగాలు ఇవ్వలేదని మండిపడుతున్నారు. ఇప్పుడు ఎన్నికల కోసం దళిత బందు పేరుతో కొత్త నాటకం ఆడుతున్నారని ఆరోపిస్తున్నారు.  కేసిఆర్‌కు ఎన్నికలు వచ్చినప్పడే దళిత, గిరిజన, అట్టడుగు వర్గాలు గుర్తుకు వస్తారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అధికారంలోకి వచ్చి ఏడు సంవత్సరాలు గడిచినా దళిత గిరిజనుల కోసం చేసింది శూన్యమన్నారు. కేసిఆర్‌ కల్లబొల్లి మాటలకు మోసపోయి గోస పడకుండ ప్రజలు కాంగ్రెస్‌ పక్షాన నిలిచి ఇంద్రవెల్లి సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement