Saturday, November 23, 2024

Delhi | 13న కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ.. తెలంగాణ, మధ్యప్రదేశ్ అభ్యర్థులపై కసరత్తు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఒకట్రెండు రోజుల్లో ఖరారు కానుంది. కనీసం తొలి జాబితానైనా విడుదల చేసేందుకు ఆ పార్టీ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా శుక్రవారం కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికను అజెండాగా పేర్కొంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ నేతలు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు.

రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలకు దరఖాస్తులు ఆహ్వానించగా.. 1000కి పైగా దరఖాస్తులు అందాయి. తొలి దశలో రాష్ట్రస్థాయిలో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ అభ్యర్థుల జాబితాను వడపోసి ప్రతి నియోజకవర్గానికి 2-3 పేర్లతో జాబితాను తయారు చేసి జాతీయ నాయకత్వానికి అందించింది. సుమారు 300 పేర్లతో వచ్చిన ఆ జాబితాపై స్క్రీనింగ్ కమిటీ పలు దఫాలుగా సమావేశమై కసరత్తు చేసింది.

- Advertisement -

పార్టీ సీనియర్ నేతలు, ప్రజాదరణ కల్గిన నేతలు పోటీ చేసే నియోజకవర్గాల్లో కసరత్తు దాదాపు పూర్తయింది. స్క్రీనింగ్ కమిటీలో ఏకాభిప్రాయం సాధించిన సీట్లకు ఒకే అభ్యర్థి పేరుతో జాబితాను తయారు చేశారు. ఏకాభిప్రాయం సాధించలేకపోయిన నియోజకవర్గాల విషయంలో ఇద్దరు లేదా ముగ్గురు పేర్లతో స్క్రీనింగ్ కమిటీ జాబితాను అధిష్టానానికి అందజేసినట్టు తెలిసింది. 119 నియోజకవర్గాల్లో దాదాపు 100 నియోజకవర్గాలకు కసరత్తును పూర్తయింది.

స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, మాజీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య చాలా నియోజకవర్గాల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టు తెలిసింది. స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న కేరళ నేత, ఎంపీ కే. మురళీధరన్ ఈ ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రయత్నించినప్పటికీ కుదరలేదని, దాంతో ఆయన రెండు లేదా మూడు పేర్లను ప్రతిపాదిస్తూ తదుపరి నిర్ణయాన్ని పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీకే వదిలేశారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈ దశలో శుక్రవారం కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. పార్టీ అధిష్టానం పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయమని పార్టీ నేతలు చెబుతున్నారు. కమిటీ ఆమోదముద్ర వేసిందంటే.. ఇక ఆ జాబితాను ఏఐసీసీ ఏ క్షణమైనా విడుదల చేసే అవకాశం ఉంటుంది.

మొత్తం 119 స్థానాలకు కసరత్తు పూర్తిచేసి ఒకేసారి అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం భావించినప్పటికీ.. పలు విషయాలపై ఇంకా స్పష్టత లేకపోవడం వల్ల అది సాధ్యపడలేదు.

కమ్యూనిస్ట్ పార్టీలు సీపీఐ, సీపీఐ(ఎం)తో పొత్తు అంశం, ఒకే కుటుంబం నుంచి ఒకరికి మించి టికెట్లు ఆశిస్తుండడం, బీసీ నేతల డిమాండ్లు, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నుంచి వస్తున్న డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అన్ని వర్గాలను సంతృప్తిపరుస్తూ.. అదే సమయంలో గెలుపు అవకాశాలకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ జాబితాపై కసరత్తు చేస్తున్నారు. అందుకే మొత్తం అన్ని స్థానాలకు అభ్యర్థులను ఒకే విడతలో ఎంపిక చేయడం సాధ్యపడలేదని, తొలి జాబితాలో కనీసం 70-80 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. 

Advertisement

తాజా వార్తలు

Advertisement