న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తదుపరి జాబితా సిద్ధం చేసేందుకు ఆ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ బుధవారం భేటీ కానుంది. దీనికంటే ముందు జరగాల్సిన పడపోత కార్యక్రమాన్ని రాష్ట్ర నాయకత్వంతో పాటు స్క్రీనింగ్ కమిటీ రెండ్రోజుల క్రితం పూర్తి చేసింది. ఈ క్రమంలో ఒకే సీటుకోసం పోటీపడుతున్న ఇద్దరు, ముగ్గురు బలమైన నేతలను పిలిచి సర్దిచెప్పి రాజీ ఫార్ములా కూడా కుదిర్చే ప్రయత్నాలు కూడా చేసింది.
టికెట్ ఆశించి భంగపడే నేతలను బుజ్జగించేందుకు ఏర్పాటైన జానారెడ్డి కమిటీ సైతం రంగంలోకి దిగింది. అసమ్మతి నేతలతో వరుసగా భేటీలు జరుపుతూ సర్దిచెప్పే ప్రయత్నాలు చేస్తోంది. అయినా సరే తొలి జాబితా విడుదల అనంతరం తలెత్తిన అసమ్మతి సెగ, బీజేపీ జాబితా విడుదల అనంతరం వివిధ వర్గాల నుంచి పెరిగిన ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని బుధవారం నాటి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీలో అభ్యర్థుల ఎంపిక జరిగే అవకాశం ఉందని ఆశావహులు ఆశాభావంతో ఉన్నారు.
బీసీలు, మహిళలే కీలకం!
తెలంగాణ సమాజంలో 56% వరకు ఉన్న బీసీ ఓటర్లు, 50% వరకు ఉన్న మహిళా ఓటర్లకు గాలం వేసేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆ రెండు వర్గాలకు అధిక ప్రాధాన్యతనిచ్చింది. ఆ పార్టీ 52 మందితో విడుదల చేసిన తొలి జాబితాలో ఏకంగా 19 మంది బీసీ నేతలకు, 12 మంది మహిళలకు చోటు కల్పించి ప్రత్యర్థులను ఇరకాటంలో పడేసింది. దీనికి తోడు దేశాన్ని పరిపాలించే కీలక ప్రధాన మంత్రి పదవినే బీసీలకు అందించిన పార్టీగా ప్రచారం చేసుకుంటున్న కమలనాథులు, ఇప్పుడు తెలంగాణలో ‘బీసీ ముఖ్యమంత్రి’ నినాదాన్ని కూడా అందుకున్నారు.
దీని ప్రభావం బీసీ ఓటుబ్యాంకుపై ఉంటుందని, ఇప్పటికే బీసీలను నిర్లక్ష్యం చేశారన్న అసంతృప్తి సెగలు వినిపిస్తున్న తరుణంలో తదుపరి జాబితాలోనైనా ప్రాధాన్యత ఇవ్వకపోతే బీసీ ఓటర్లు దూరమయ్యే ప్రమాదం ఉందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ చేసేదేమీ లేకున్నా.. 55 మందితో తొలి జాబితా మాత్రమే విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీకి సరిదిద్దుకునే అవకాశం కల్పించింది.
తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ)లో చేసిన తీర్మానం ప్రకారం కనీసం 34 సీట్లైనా బీసీలకు ఇవ్వాలని ఆ వర్గం నేతలు డిమాండ్ చేస్తున్నారు. అందుకే తదుపరి జాబితాపై జరిగే కసరత్తులో ఈ అంశాన్ని అధిష్టానం దృష్టిలో పెట్టుకుంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. లేదంటే బీసీ ఓట్లు కాంగ్రెస్‌కు దూరమై ఆ మేరకు బీఆర్ఎస్ లేదా బీజేపీలకు ప్రయోజనం చేకూర్చుతాయని కాంగ్రెస్ పెద్దలు కొంత ఆందోళన చెందుతున్నట్టు కనిపిస్తోంది.
తేలని పొత్తుల వ్యవహారం
జాతీయస్థాయిలో ఏర్పాటైన కూటమిలో భాగంగా పొత్తు ధర్మం ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సీపీఐ, సీపీఐ(ఎం)కు చెరో రెండు సీట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. తొలుత చెరో ఐదు సీట్లు డిమాండ్లు చేసిన కమ్యూనిస్టు పార్టీలతో కాంగ్రెస్‌కు సంఖ్య విషయంలో ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ ఏయే స్థానాలను ఆ రెండు పార్టీలకు ఇవ్వాలన్న విషయంపై మాత్రం ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. చెన్నూరు, కొత్తగూడెం స్థానాల్లో సీపీఐ పోటీ చేసేలా, వైరా, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో సీపీఐ(ఎం) పోటీ చేసేలా కాంగ్రెస్ పెద్దలు కసరత్తు చేశారు.
ఈ విషయం బయటకు పొక్కడంతో వైరా, మిర్యాలగూడ, చెన్నూరులో కాంగ్రెస్ నేతల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థులు సునాయాసంగా గెలవగలిగే స్థానాలను మిత్రపక్షాలకు ఇవ్వొద్దని, పార్టీ బలహీనంగా ఉన్న చోట కేటాయిస్తే అభ్యంతరం లేదని ఆయా నియోజకవర్గాల్లోని నేతలు చెబుతున్నారు. ఒకవేళ తమ మాట కాదని కమ్యూనిస్టులకు కేటాయిస్తే.. అక్కడ ప్రత్యర్థులు సునాయాసంగా గెలుపొందుతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కమ్యూనిస్టు పార్టీలకు ఇచ్చే స్థానాల ఎంపిక కాంగ్రెస్ పెద్దలకు చిక్కుముడిలా మారింది.