Tuesday, November 26, 2024

ఏపీ రాజధానిగా ‘తిరుపతి’ని చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ అభ్యర్థి

తిరుపతి ఉపఎన్నికలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుపతిని రాజధానిగా ప్రకటించేలా అధిష్ఠానాన్ని ఒప్పిస్తానని ప్రకటన చేశారు. తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత వర్గాల్లో ఆందోళన నెలకొందన్నారు. ఇప్పుడు దళితులు కాంగ్రెస్‌కు మరింత దగ్గరయ్యారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, మన్నవరం భెల్ పరిశ్రమ, దుగరాజపట్నం ఓడరేవులను తీసుకొచ్చి తీరుతానని స్పష్టం చేశారు.

రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, విభజన గాయాన్ని చూపించి కాంగ్రెస్ పనైపోయిందని కుహనా మేధావులు, కొన్ని రాజకీయ పార్టీలు ప్రచారం చేస్తూ సంబరపడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఇలాంటి వారికి త్వరలోనే సమాధానం లభిస్తుందని, మోదీ త్వరలో ఇంటికి వెళ్లడం ఖాయమని తేల్చి చెప్పారు. పెరిగిన ధరలతో ప్రజల్లో ఆర్థిక ఒత్తిడి ఎక్కువైందని, కాంగ్రెస్‌తోనే మళ్లీ మంచి రోజులు వస్తాయని ప్రజలు నమ్ముతున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement