మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. చేవెళ్లలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సభలో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తాము ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధును ఇవ్వకుంటే లబ్ధిదారులను తీసుకొచ్చి, సెక్రటేరియట్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్ష చేపడతామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ దళితులకు 12 లక్షలు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి, ఒక్కరికి కూడా ఇవ్వడం లేదన్నారు.
ఇప్పుడు కనీసం 10 లక్షలు కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల్ని మోసం చేసిందంటూ కేసీఆర్ మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో ప్రొసిడింగ్ అయిన 1 లక్ష 30 వేల మందికి దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను ఐక్యరాజ్యసమితి కొనియాడిందన్నారు. ఇతర రాష్ట్రాలు సైతం తాము తీసుకొచ్చిన పథకాలను వారి రాష్ట్రాల్లో అమలు చేయాలని, ఇక్కడికి వచ్చి పరిశీలించి అభినందించాయని కేసీఆర్ పేర్కొన్నారు.