Tuesday, November 26, 2024

Followup | తెలంగాణకు ఆరు గ్యారెంటీలను ప్రకటించిన కాంగ్రెస్‌.. మూడు కీలక వాగ్దానాలిచ్చిన‌ సోనియా

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : అసెంబ్లి ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రజలకు కీలక వాగ్దానాలు చేసింది. తమ పార్టీ అధికారంలోకి రాగానే అమలు చేసే ఆరు హామీలను ప్రకటించింది. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశాల నేపథ్యంలో నగర శివారులోని తుక్కుగూడలో ఆ పార్టీ నిర్వహించిన విజయ భేరీ బహిరంగసభలో ప్రసంగించిన కాంగ్రెస్‌ అగ్రనేత సోనియగాంధీ ఈ హామీలను ప్రకటించారు. మహాల క్ష్మీ పథకం ద్వారా రాష్ట్రంలోని పేద మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని ప్రకటించింది.

మహిళలకు రూ.500కే వంట గ్యాస్‌ సిలిండర్‌ను అందజేస్తామని తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు వీలు కల్పిస్తామని పేర్కొంది. అధికారంలోకి వచ్చిన వెనువెంటనే ఈ హామీలను నెరవేరుస్తామని సోనియా విజయభేరి సభా వేదిక నుంచి ప్రకటించారు. అన్నివర్గాల సంక్షేమం కోసం పనిచేసే కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలన్నదే తన స్వప్నమని సోనియా పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ వల్లే తెలంగాణ కల సాకారమైందని, ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. చరిత్రాత్మకమైన రోజున తెలంగాణ ప్రజలకు పథకాలను ప్రకటిస్తున్నామని వీటిని కచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలన్నదే కాంగ్రెస్‌ పార్టీ ఆకాంక్ష అని చెప్పారు. ఆరు గ్యారంటీలను ప్రకటిస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి మీరు మద్దతిస్తారా…? అంటూ ఆమె సభకు హాజరైన ప్రజలను కోరగా అందరూ లేచి నిలబడి కరతాల ధ్వనులు చేశారు.

కాంగ్రెస్‌ పార్టీలో తమ సహచరుల పోరాటం వల్ల తెలంగాణ రాష్ట్రం సాధన జరిగిందని గుర్తు చేశారు. ఎంతో మంది విద్యార్థులు, యువకులు రాష్ట్ర సాధన కోసం బలిదానం చేశారని వారికి అండగా కాంగ్రెస్‌ పార్టీ నిలబడి తెలంగాణ ఇచ్చిందని ఆమె గుర్తు చేశారు. చరిత్రాత్మకమైన రోజున తాను తెలంగాణలో పర్యటించడం సంతోషంగా ఉందని సోనియా పేర్కొన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని గొప్ప ఎత్తులోకి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రజలు సహకరించాలని కోరారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వమేర్పడి, తెలంగాణ ప్రజలకు సేవ చేయడం తన కల అని ఉద్ఘాటించారు.

రైతు భరోసా పథకాన్ని ప్రకటించిన ఏఐసీసీ చీఫ్‌ ఖర్గే…

- Advertisement -

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలకు ఎకరాకు రూ.15వేలు, రూ. 12వేలు ఆర్థికసాయం చేస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే ప్రకటించారు. పట్టాదారు రైతులకు రూ.15వేలు, కౌలు రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12వేల చొప్పున చెల్లించేందుకు మాట ఇస్తున్నామని ఆయన విజయభేరీ సభ ద్వారా ప్రకటించారు.

వరికి కనీస మద్దతు ధర చెల్లించడంతోపాటు అదనంగా రూ.500 బోనస్‌ కూడా ఇస్తామని ఖర్గే ప్రకటించారు. మిగులు రాష్ట్రమైన తెలంగాణను సీఎం కేసీఆర్‌ అప్పుల కుప్పగా మార్చారని దుయ్యబట్టారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ దొందూ దొందేనని, రెండు పార్టీల నడుమ స్పష్టమైన లోపాయికారి ఒప్పందం ఉందని ఆయన ఆరోపించారు.

దేశానికి స్వాత్రంత్యం కాంగ్రెస్‌ తీసుకువచ్చిందని, తెలంగాణను ప్రత్యేక రాష్ట్రం చేసిన ఘనత కూడా కాంగ్రెస్‌ పార్టీదేనని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజలకు సెప్టెంబరు 17 చరిత్రాత్మకమైన రోజు అని, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 13 నెలల తర్వాత తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రకటిస్తోందని, వీటన్నింటినీ తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత పార్టీ అధినాయకత్వం తీసుకుంటుందని ప్రజలకు హామీ ఇచ్చారు.

కాంగ్రెస్‌ పార్టీ మాట ఇస్తే అమలు చేసి తీరుతుందని, బీజేపీ బీఆర్‌ఎస్‌లాగా ప్రజలకు శుష్క వాగ్దానాలు చేయదని గుర్తు చేశారు. దళితులు, గిరిజనులకు ఉచితంగా మూడెకరాల వ్యవసాయ భూమి ఇస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి తప్పిన ఘనుడు సీఎం కేసీఆర్‌ అని , బడుగు, బలహీన నిమ్నజాతి వర్గాల పట్ల కేసీఆర్‌ తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, అందులో భాగంగానే ఆయన ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయారని ఆరోపించారు.

పేదలకు ఉపయోగపడే ఎన్నో పథకాలను కాంగ్రెస్‌ పార్టీ అమలు చేసిందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం సాకారం చేసింది కూడా కాంగ్రెస్‌ పార్టీనేనని చెప్పారు. ఆహార భద్రతా చట్టాన్ని తీసుకువచ్చి పేద ప్రజల ఆకలి తీర్చిన ఘనత కూడా కాంగ్రెస్‌ పార్టీదేనని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఓట్ల కోసం తమ పార్టీ అగ్రనేత సోనియా ఇవ్వలేదని, 60ఏళ్ల పోరాటాన్ని, ఇక్కడ జరిగిన బలిదానాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చారని తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌, ప్రధాని నరేంద్ర మోడీ పైకి విమర్శలు, ఆరోపణలు ఎక్కుపెడుతున్నా ఈ ఇద్దరి మధ్య రహస్య ఒప్పందం ఉందని, బీఆర్‌ఎస్‌కు బీజేపీ బీ టీంగా పనిచేస్తోందని చెప్పారు.

ఈ రెండు పార్టీలు ఒకరి నొకరు తిట్టుకున్నట్లు నటించి లోలోపల కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు. ఓట్ల కోసం ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌ మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖర్గే పిలుపునిచ్చారు. పదేళ్లుగా దేశంలో అన్ని వ్యవస్థలను నరేంద్ర మోడీ నిర్వీర్యం చేశారని, 70ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో పనిచేసిన ప్రధాన మంత్రులు ఎన్నో భారీ సంస్థలను నెలకొల్పి కోట్లాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తే ప్రధాని మోడీ ఒక్కో సంస్థను మూసివేస్తూ వాటిని ప్రయివేటుపరం చేస్తున్నారని చెప్పారు.

తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏటా రెండుకోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తానన్న ప్రధాని మోడీ ఉద్యోగాల కల్పనే విస్మరించారని, నిరుద్యోగం తాండవిస్తున్నా బీజేపీ ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టడం లేదని దుయ్యబట్టారు. దేశంలోని యువత, నిరుద్యోగులు, విద్యావంతులు, ఆయా వర్గాల ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని, లోక్‌సభ, అయిదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లిd ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న బీజేపీని తిరస్కరించాలని ఆయన పిలుపునిచ్చారు.

తెలంగాణలో అధికారంలోకి వస్తాం..

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చితీరుందని ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రావడానికి తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు కూడా తమ మద్దతు ప్రకటించారని, విజయభేరి సభకు వచ్చిన ప్రజల జోష్‌ చూస్తుంటే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం కలిగిందని చెప్పారు.

తాము తప్పకుండా అధికారంలోకి వస్తామని ఆయన పేర్కొన్నారు. నరేంద్ర మోడీ, కేసీఆర్‌లా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తప్పించుకుని తిరిగే నైజం కాంగ్రెస్‌ది కాదని, కాంగ్రెస్‌ పార్టీ చెప్పింది చేసి చూపిస్తుందని, ఇం దుకు ఉదాహారణ కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఇచ్చిన హామీలను నెరవేర్చి చూపించామని చెప్పారు.

మేము చెప్తే చేస్తాం..: హిమాచల్‌ సీఎం సుఖ్వీందర్‌సింగ్‌

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చే ఆరు గ్యారంటీలను అధికారంలోకి వచ్చాక తప్పక అమలు చేస్తుందని హిమాచల్‌ ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌సింగ్‌ సుఖ్‌ అన్నారు. కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో తాము ఎన్నికల ముందు చెప్పింది చేసి చూపించామని, తెలంగాణలో కూడా చేసేదే చెప్తామని ఆయన పేర్కొన్నారు.

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌గె హ్లోత్‌ మాట్లాడుతూ ఇంధిరాగాంధీ, రాజీవ్‌గాంధీ దేశం కోసం ప్రాణాలర్పించారని చెప్పారు. సోనియాగాంధీ తన కుటుంబం గురించి ఏనాడూ ఆలోచించలేదని, రెండుసార్లు అవకాశం వచ్చినా రాహుల్‌గాంధీని ప్రధానిని చేయలేదని పేర్కొన్నారు. దేశం కోసం అనుభవజ్ఞులైన ఆర్థికవేత్త మన్మోహన్‌సింగ్‌నే ప్రధానిగా చేశారని ఆయన పేర్కొన్నారు.

కాగా… హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో నిర్మించనున్న రాజీవ్‌గాంధీ నాలేడ్జ్‌ , శిక్షణా కేంద్రానికి సోనియాగాంధీ మీటనొక్కి ప్రారంభించారు. ఇప్పటికే భవన నిర్మాణానికి సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు అనుమతులు మంజూరు కాగా త్వరలో వీటి పనులను ప్రారంభించాలని పీసీసీ చీఫ్‌ రేవంత్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement