రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసి పని చేస్తున్నారు. ఒకరు మతం పేరుతో, మరొకరు రిజర్వేషన్ల పేరుతో ఓట్ల కోసం వస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీజేపీలను ఓడించి పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి. భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీదే.. కార్యకర్తలు అధైర్య పడొద్దు. అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.
సంగారెడ్డి జిల్లా మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా హత్నోర మండలములో నిర్వహించిన రోడ్ షోలో మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సంర్భంగా మాట్లాడుతూ.. ‘‘ఎన్నికల్లో అబద్దపు హామీలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని.. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేస్తే నట్టేట ముంచారని హరీశ్ రావు అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయ్యిందన్నారు. మహాలక్ష్మి ద్వారా నెలకు 2500 ఇస్తామని చెప్పి మహిళలను మోసం చేశారని మండిపడ్డారు. హామీల అమలు కోసం అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్ ని గెలిపించండి అన్నారు. హామీల అమలు కోసం ప్రశ్నించినందుకు కేసీఆర్ పై.. రేవంత్ రెడ్డి అహంకారంతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లతో బుద్ది చెప్పాలి అని పిలుపునిచ్చారు.
పదేళ్ళ బీజేపీ పాలనలో ప్రజల కోసం చేసిందేమీ లేదు. పదేళ్ళ పాలనలో బీజేపీ ధరలు పెంచడం తప్ప ఏమీ చేయలేదు. బీఆర్ఎస్ పేదల పార్టీ. కేసీఆర్ ను ప్రజలు కాపాడుకోవాలి. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మాటలు నమ్మద్దు. బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచి ప్రజలపై భారం మోపింది అని అన్నారు.
అభివృద్ధి కోసం కొట్లాడతా.. వెంకట్రామి రెడ్డి
మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామి రెడ్డి మాట్లాడుతూ.. మెదక్ పార్లమెంటు ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించండి. బీజేపీ పార్టీ అభ్యర్థి రఘునందన్ రావును దుబ్బాక ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారు. మెదక్ ప్రాంత అభివృద్ధి కోసం పార్లమెంటులో కొట్లాడతాను. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న యువత కోసం ఉచిత కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి శిక్షణ ఇప్పిస్తాను. స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసి.. జాబ్ మేళాలు నిర్వహించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాము. ట్రస్ట్ ఏర్పాటు చేసి నిరుపేదల పిల్లల చదువుల కోసం ఫీజులు కట్టి సాయం చేస్తాను అని అన్నారు.