దుబాయ్ కార్ రేసులో మూడో స్థానంలో హీరో టీమ్
మరిన్ని విజయాలు సాధించాలనన్న ఎపి డిప్యూటీ సిఎం
వెలగపూడి – దుబాయ్ కార్ రేసులో విజయం సాధించిన తమిళ అగ్రకథానాయకుడు అజిత్ కుమార్ కు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘‘దుబాయ్ 24H రేసులో GT4 విభాగంలో “స్పిరిట్ ఆఫ్ ది రేస్” అవార్డును 991 విభాగంలో థర్డ్ ప్రైజ్ గెలుచుకున్నందుకు అజిత్ కుమార్ ఆయన టీమ్‌కు అభినందనలు చెప్పారు. గొప్ప సంకల్పంతో సవాళ్లను అధిగమించి, ప్రపంచ వేదికపై భారత్ జెండాను ఎగురవేయడం నిజంగా స్ఫూర్తిదాయకం. మీకు , మీ బృందానికి మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
అభినందనల వెల్లువ ..
మరోవైపు దుబాయ్ కారు రేసింగ్‌లో సత్తా చాటిన అజిత్ కు ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అగ్ర కథానాయకుడు రజనీకాంత్, సమంత సోషల్ మీడియాలో అజిత్‌ను ఉద్దేశించి పోస్ట్‌లు పెట్టారు. మరోవైపు రేసులో గెలిచిన ఆనందాన్ని అజిత్ తన కుటుంబసభ్యులతో పంచుకున్నారు. తన భార్య షాలినికి థాంక్స్ చెప్పారు. ఆమెను ఆప్యాయంగా హత్తుకున్నారు.