హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణలో ఆదివారం జరిగిన పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షపై గందరగోళం ఏర్పడింది. కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నపత్రంలో కొన్ని తప్పులున్నాయంటూ సోషల్ మీడియాలో వార్త వైరల్ అవడంతో పరీక్ష రాసిన అభ్యర్థుల్లో గందరగోళం ఏర్పడింది. ఒకవేళ తప్పులు దొర్లితే మార్కులు కలుపుతారా? లేదా? అనే అనుమానాలను అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ సోమవారం వివరణ ఇస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. కానిస్టేబుల్ ప్రశ్నపత్రంలో 13 ప్రశ్నలు గందరగోళంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులపై పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు దృష్టిపెట్టింది. సెట్ ‘డి’లో 13 ప్రశ్నలు గందరగోళంగా ఉన్నట్లు రిక్రూట్‌మెంట్ బోర్డుకు ఫిర్యాదులు అందాయి. వాటిని పూర్తిస్థాయిలో పరిశీలించి రెండు రోజుల్లో క్లారిటీ ఇస్తామని రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. వివరణ ఇచ్చేంత వరకు అభ్యర్తులెవరూ వదంతులు నమ్మవద్దంటూ రిక్రూట్‌మెంట్ బోర్డ్ చైర్మన్ వి.వి. శ్రీనివాస రావు ప్రకటనలో కోరారు. అయితే నిపుణుల కమిటీతో చర్చించి వారు ఇచ్చే నివేదిక ఆధారంగానే రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్ణయం తీసుకోనుంది. రెండ్రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది.
15644 పోస్టులకు గాను 9.50 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ప్రిలిమినరీ పరీక్షలో మైనస్ మార్కులు ఉండటంతో అభ్యర్థులు చాలా జాగ్రత్తగా సమాధానాలు గుర్తించినట్లు తెలిసింది. 60 మార్కులు సాధిస్తే ప్రతీ అభ్యర్థి అర్హత సాధించినట్లే. తర్వాత ఫిజికల్ టెస్టులకు అభ్యర్థులకు సన్నద్ధం అవ్వాల్సి ఉంటుంది. కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో తప్పులు దొర్లాయనే వార్తలు సోమవారం ఉదయం నుంచి సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొట్టాయి. ఏకంగా మార్కులు కూడా కలిపినట్లు ప్రచారం జరిగింది. అయితే 13 ప్రశ్నల్లో గందరగోళం ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. దీనిపై ఫిర్యాదులు ఎక్కువ వస్తే మార్కులు కలిపే అవకాశాన్ని బోర్డు పరిశీలించనున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గరిష్టంగా ఎనిమిది మార్కులు కలిపే అవకాశం ఉంటుందనే వాదనలూ వినిపిస్తున్నాయి.