Sunday, November 10, 2024

Condolences – రామోజీ రావు మృతి – చిరంజీవి, బాల‌కృష్ణ ,జూనియ‌ర్ ఎన్టీఆర్ ల సంతాపం

ఈనాడు గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ రామోజీరావు మృతిపట్ల ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. రామోజీరావు మరణ వార్త తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. తెలుగు పత్రికా రంగంలో రామోజీ రావు మకుటంలేని మహారాజు అని అన్నారు. తెలుగులోనే కాకుండా దేశ పత్రికా రంగంలో ఓ కొత్త ఒరవడిని సృష్టించారని కొనియాడారు. భావితరాల పత్రికా ప్రతినిధులకు మార్గదర్శిగా నిలిచారన్నారు. చిత్రసీమలో సైతం అదే తీరున సాగి ఉషోదయ కిరణాలను ప్రసరించారన్నారు. తన తండ్రి నందమూరి తారక రామారావుతో రామోజీకి ఉన్న అనుబంధం ప్రత్యేకమైందని గుర్తు చేసుకున్నారు. రామోజీ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

దివికేగిన మేరు ప‌ర్వ‌తం …చిరంజీవి

ఉషాకిరణ్‌ ఫిలిమ్స్‌ అధినేత రామోజీరావు మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మెగాస్టార్‌ చిరంజీవి రామోజీ అస్తమయంపై ఎక్స్‌లో దిగ్భ్రాంతిని ప్రకటించారు. రామోజీ ఎవరికీ తలవంచని మేరు పర్వతం దివికేగిందని, ఓం శాంతి అంటూ సంతాపం తెలిపారు.

రామోజీ మరణం బాధాకరం.. ఎన్టీఆర్‌
రామోజీరావు మన మధ్యన లేరు అనే వార్త చాలా బాధాకరమనం జూనియర్‌ ఎన్టీఆర్ పేర్కొన్నారు. మీడియా సామ్రాజ్యాధినేత, భారతీయ సినిమా దిగ్గజం రామోజీ లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని అన్నారు. ‘నిన్ను చూడాలని’ చిత్రంతో నన్ను తెలుగు సినీపరిశ్రమకి పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికీ మరువలేనని అన్నారు.

మంచు విష్ణు..
రామోజీరావు మృతి పట్ల సినీనటుడు మంచు విష్ణు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి చాలా బాధాకరమన్నారు. రామోజీని కలిసిన ప్రతిసారీ ఎంతో లోతైన జీవిత పాఠాన్ని నేర్చుకున్నట్లు చెప్పారు. సినీ పరిశ్రమకు ఆయన ఎప్పుడూ అండగా నిలిచారని గుర్తు చేశారు. జర్నలిజం, వినోద రంగంలో అసమానమైన ప్రమాణాలను నెలకొల్పి గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించారని కొనియాడారు. ఆయన ఎంతో మందికి స్ఫూర్తి అని తెలిపారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియచేశారు.

- Advertisement -

విక్ట‌రీ వెంక‌టేష్

రామోజీరావు మృతి పట్ల సినీ నటుడు వెంటకేశ్‌ కూడా సంతాపం తెలిపారు. రామోజీ నిజమైన దార్శనికుడని, భారతీయ మీడియాలో ఆయన విప్లవాత్మక కృషి చేశారని కొనియాడారు. జర్నలిజం, సినీ రంగంలో ఆయన చేసిన కృషి ఎంతోమందికి స్ఫూర్తిదాయకమన్నారు.

రామోజీరావు నా సినీ కెరీర్‌కు పునాది వేశారు : నరేశ్‌
‘రామోజీ రావు గారు మరణించారనే హృదయ విదారక వార్త విని బాధపడ్డా. ఆయన నా సినీ కెరీర్‌కు పునాది వేశారు. ఆయన నా గాడ్‌ ఫాదర్‌, నా స్ఫూర్తి. తెలుగు చిత్రపరిశ్రమను గొప్ప స్థాయికి తీసుకెళ్లిన మహోన్నత వ్యక్తి. ఆయన మృతి పరిశ్రకు తీరని నష్టం. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాను’ అని నరేశ్‌ అన్నారు.

షూటింగ్ స్పాట్ లో రామ్ చ‌ర‌ణ్ సంతాపం

పత్రికా రంగంలో చెరగని ముద్ర వేసిన ఈనాడు సంస్థల అధినేత, దిగ్గజ పాత్రికేయులు రామోజీరావు గారి మరణం అత్యంత బాధాకరం అని గేమ్ ఛేంజర్ యూనిట్ పేర్కొంది. ఈ రోజు రాజమండ్రిలో గేమ్ ఛేంజర్ చిత్రీకరణ చేస్తున్న రామ్ చరణ్… రామోజీ రావు గారికి అశ్రు నివాళులు అర్పించారు. ఆయనతో పాటు దర్శకుడు శంకర్, నటులు సునీల్ రఘు కారుమంచి ఇతర చిత్ర బృంద సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. రామోజీరావు గారి మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు అని తెలిపారు.

కీర‌వాణి..

ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావుపై ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ప్రశంసల వర్షం కురిపించిన ఒక పాత వీడియో వైరల్ అవుతుంది. ఆస్కార్ అందుకున్న తరువాత ఆయన కోసమైనా తనకు ఆస్కార్ అవార్డు రావాలని కోరుకున్నానని కీరవాణి వెల్లడించారు. అప్పుడు అయన మాట్లడుతూ ఆస్కార్ అవార్డును అందుకునే విషయంలో తనకు ఏమీ ఎగ్జయిట్‌మెంట్ లేదని.. వస్తే చాలా మంచిదనే సదుద్దేశంతో ఉన్నానని తెలిపారు. ఎన్నో విపత్కర పరిస్థితులను జీవితంలో అనుభవించిన తనకు ఆస్కార్ అవార్డు అనేది పెద్ద ఎగ్జయిట్‌మెంట్‌ను ఇవ్వలేదని కూడా అప్పట్లో ఆయన అన్నారు.

అల్లు అర్జున్…

రామోజీ రావు గారి మరణవార్త విని చాలా బాధపడ్డాను. నేను గౌరవించే స్ఫూర్తిదాయక వ్యక్తుల్లో ఆయన ఒకరు. మీడియా, సినిమా, ఇతర రంగాలకు ఆయన చేసిన సేవలు మరువలేనివి. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా అంటూ అల్లు అర్జున్ రాసుకోచ్చాడు.

వరల్డ్‌ నెం.1 చేయాలన్నది ఆయన కోరిక: మురళీమోహన్
రామోజీ గ్రూప్‌లో ఎన్నో సంస్థలు నెలకొల్పి ఎంతో మందికి జీవితాలను ఇచ్చారు. నేను ఎప్పుడు వచ్చిన ఆప్యాయంగా పలకరించేవారు. మహోన్నత వ్యక్తి రామోజీరావుగారు. ఫిల్మ్‌సిటీని వరల్డ్‌ నంబర్‌ వన చేయాలన్నది ఆయన కోరిక’’ అని అన్నారు మురళీమోహన్

“రామోజీరావు నాకు ఎంతో స్ఫూర్తి. సొంత వ్యక్తిత్వంతోనే జీవించాలన్నది ఆయనను చూసే నేర్చుకున్నా. ప్రతి ఒక్కరూ నాయకత్వం లక్షణాలు ఆయన నుంచే నేర్చుకోవాలి. ఆయన మార్గంలో పయనిస్తే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు’’…
– నిర్మాత డి.సురేష్‌బాబు

“అలెగ్జాండర్‌ ది గ్రేట్‌.. రామోజీ ది గ్రేట్‌ అని నేనెప్పుడూ చెబుతూ ఉంటా. ఎంతో మందికి ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి. నేను, రాజ్‌ ఉషాకిరణ్‌ మూవీస్‌ బ్యానర్‌లో చిత్రాలకు పనిచేశాం. ‘నువ్వే కావాలి’ చిత్రానికి సోలోగా అవకాశం ఇచ్చారు. సిల్వర్‌ జూబ్లీ ఫంక్షన్‌ రోజున నన్ను ఎంతో మెచ్చుకుని ఆశీర్వదించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా’’ సంగీత దర్శకుడు కోటి

“ఒక మహానుభావుడిని మేం కోల్పోయాం. స్టూడియో కట్టేటప్పుడు కూడా మమ్మల్ని పిలిచి సలహాలు అడిగేవారు. అలాంటి గొప్ప వ్యక్తి మాకు దూరమైపోయారు. షూటింగ్‌ సమయంలో ఆయన అందించిన ఏర్పాట్లు ఎంతో ప్రయోజనం కలిగాయి. మయూరి డిస్ర్టిబ్యూషన్‌ ద్వారా చాలా సినిమాలు విడుదల చేశాం’’ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి

మహేష్ బాబు….

సూపర్ స్టార్ మహేష్ బాబు రామోజీరావుకు నివాళులర్పించారు.ఎంతో దూర దృష్టి గల రామోజిరావు గారి మరణ వార్త నన్ను కలచి వేసింది..రామోజీ ఫిలిం సిటీ సినిమాపై ఆయనకున్న ఇష్టానికి నిదర్శనం.ఆయన ప్రస్థానం మనకు ఎప్పటికి స్ఫూర్తిని ఇస్తుంది.ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని మహేష్ ట్వీట్ చేసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement