హైదరాబాద్, ఆంధ్రప్రభ : పాలు, పాల అనుబంధ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ పన్నుపోటుకు నిరసనగా పాడి రైతులతో కలిసి టిఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన బాట పట్టాయి. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాల క్యానులు, ప్లకార్డులతో ఆందోళనను టిఆర్ఎస్ కార్యకర్తలు చేపట్టారు. కేంద్రంప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నినాదించారు. రైతుల ఆదాయంలో అత్యంత కీలకమైన పాలు, పాల ఉత్పత్తులపై పన్ను విధించడం వలన జరిగే నష్టాన్ని అన్ని జిల్లాల్లో ఆందోళన చేపట్టిన టిఆర్ఎస్ శ్రేణులు రైతులకు వివరించారు. పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే. కేశవ రావు నేతృత్వంలో టిఆర్ఎస్ ఎంపీలు కేంద్రానికి వ్యతిరేకంగా గళమెత్తారు.
హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ వద్ద ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ కార్యకర్తలు నిరసన ర్యాలీ నిర్వహించారు. మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లాలో నిరసన కార్యక్రమం జరిగింది. మహబూబ్‌నగర్ తెలంగాణ చౌరస్తాలో పాడి రైతులు, మహిళల ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. పసిపిల్లలు తాగేపాలపై కూడా మోడీ ప్రభుత్వం జీఎస్టీ విధించిన తీరు చూస్తే భవిష్యత్‌లో ఎలాంటి పన్నులను విధిస్తుందో ఆర్థం కాకుండా ఉందన్నారు. పీల్చే గాలిపై కూడా జీఎస్టీ విధిస్తారని భయంగా ఉందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.