Friday, November 22, 2024

ధాన్యం సేకరణపై పార్లమెంట్‌లో ఆందోళన.. ఉభయసభల్లో టీఆర్‌ఎస్ ఎంపీల వాకౌట్..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో రైతన్న ఆరుగాలం క‌ష్టించి పండించే ధాన్యాన్ని కేంద్రం సేక‌రించ‌క‌పోవ‌డాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ ఎంపీలు చేపట్టిన ఆందోళనతో లోక్‌సభ దద్దరిల్లింది. టీఆర్ఎస్ ఎంపీలు ప్లకార్డుల‌ పట్టుకుని నినాదాలు చేయడంతో మంగ‌ళ‌వారం స‌భ ప‌లుమార్లు స్తంభించింది. ధాన్యం సేక‌ర‌ణ‌పై లోక్‌స‌భ స్పీకర్ ఓం బిర్లాకు టీఆర్ఎస్ పక్ష నేత నామ నాగేశ్వరరావు స‌భ ప్రారంభం కాగానే వాయిదా తీర్మానం నోటీసులిచ్చారు. రాష్ట్రంలో పండిన పంట కేంద్ర ప్రభుత్వ ఆహార సంస్థ ఎఫ్‌సీఐ సేకరణ చేయకపోవడంతో రైతులు పడుతున్న ఇబ్బందులపై చర్చ జరపాలని అభ్యర్థించారు. దేశంలో ఆహార ధాన్యాల సేకరణపై జాతీయ విధానంపై సభలో చర్చించాలని డిమాండ్ చేశారు. ఈ విషయం చాలా ముఖ్యమైనదని, అందుచేత సభ ఈ రోజు కార్యక్రమాలు రద్దు చేసి ఈ అంశంపై చర్చ చేపట్టాలని విన్న‌వించారు.

ఎంపీల విజ్ఞ‌ప్తిని స్పీక‌ర్ ఓంబిర్లా తిర‌స్క‌రించారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకి అన్యాయం చేయవ‌ద్ద‌ని ఎంపీలు నినాదాలు చేశారు. వరి కొనుగోళ్ల కోసం నిర్ధిష్టమైన విధానం ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. అనంత‌రం టీఆర్ఎస్ ఎంపీలు పార్ల‌మెంట్ ఉభయసభలను వాకౌట్ చేసి పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహాం ముందు నిరసన చేపట్టారు. ఈ సంద‌ర్భంగా నామా నాగేశ్వ‌రరావు మాట్లాడుతూ కొత్త‌గా ఏర్ప‌డి ఎదుగుతున్న రాష్ట్ర రైతంగాన్ని ప‌ట్టించుకోక‌పోవ‌డం స‌రికాదని వ్యాఖ్యానించారు. తామేమీ గొంత‌మ్మ కోరిక‌లు కోర‌డం లేద‌ని, రైతుల కష్టమైన పంట‌ను కొన‌మంటున్నామ‌ని గుర్తు చేశారు. కేంద్రం వరిని కొనే వరకూ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement