హైదరాబాద్, ఆంధ్రప్రభ : తరగతిగది బోధన, ఆసుపత్రిలో ప్రాక్టికల్స్ లేకపోవడంతో యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి స్వరాష్ట్రానికి వచ్చిన వైద్య విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆరంభ సమయంలో ఆదుకుంటామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. స్వస్థలాలకు తిరిగొచ్చిన విద్యార్థులకు ఉక్రెయిన్ కళాశాలలు ఆన్‌లైన్ క్లాసులతోనే సరిపెడుతున్నాయి. ఉక్రెయిన్ విద్యా క్యాలండర్ ప్రకారం సెప్టెంబరులో విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న తరుణంలో రష్యాతో యుద్ధం ముగుస్తుందా..? మళ్లి ఉక్రెయిన్‌కు వెళ్లి ఎంబీబీఎస్ విద్యను కొనసాగించగలమా..? అన్న ఆందోళన విద్యార్థుల్లో నెలకొంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా తెలంగాణకు చెందిన వందలాది మంది విద్యార్థులు స్వరాష్ట్రానికి చేరుకున్నారు. ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన వారిలో ఎక్కువ మంది ఎంబీబీఎస్ మొదటి, ద్వితీయ, తృతియ సంవత్సరం విద్యార్థులే ఉన్నారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులు రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ విద్యను పూర్తి చేసేలా… చర్యలు తీసుకుంటామని అసెంబ్లిd సాక్షిగా సీఎం కేసీఆర్ కూడా ప్రకటించారు. వైద్య విద్య అంటేనే… ప్రాక్టికల్స్ కు అధిక ప్రాధాన్యత ఉంటుంది. క్లినికల్ అనుభవంతోనే వైద్య విద్య సంపూర్ణమవుతుంది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తున్నా… ప్రాక్టికల్స్ మిస్ అవుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రాక్టికల్స్ ఉంటేనే పాఠాలు అర్థమవుతాయంటున్నారు. మూడేళ్ల వైద్య విద్య పూర్తి తర్వాత ఉక్రెయిన్ లోని నిబంధనల ప్రకారం క్రాక్ -1 పరీక్షను రాయాలి. అప్పుడే నాలుగో ఏడాదిలోకి ప్రవేశం ఉంటుంది. దీంతో ప్రాక్టికల్స్ లేక, ఆన్‌లైన్ తరగతులతో పాఠాలు సరిగ్గా అర్థంకాక నాలుగో ఏడాది ఎంబీబీఎస్ చదువు ఎలా..? అని తృతీయ సంవత్సరం చదువుతున్న ఉక్రెయిన్ వైద్య విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.