Friday, November 15, 2024

Telangana : సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం…

  • వివిధ జిల్లాల్లో ఆమాత్యుల చేతుల మీదుగా శ్రీకారం
  • ప్ర‌తి ఇంటికి వెళుతున్న స‌ర్వేయ‌ర్లు
  • రంగంలో 50వేల మందికి పైగా ఉపాధ్యాయులు
  • ప్ర‌తి ఉపాధ్యాయుడికి 150ఇళ్లు అప్ప‌గింత
  • స‌ర్వేకు అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని పొన్నం విన‌తి


హైద‌రాబాద్ – తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభమైంది. వివిధ జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు సర్వేను ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సామాజిక, ఆర్థిక వివరాలను సేకరిస్తున్నారు. ఉన్న ఆస్తులెన్ని.. అప్పులెన్ని.. ఆదాయమెంత.. ఇంట్లో ఎంతమంది ఉంటారు.. ఎవరైనా విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లారా.. ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారా.. ఇలా మొత్తం 75 రకాల ప్రశ్నలతో వివరాలు సేకరిస్తున్నారు. సర్వేలో కుటుంబ యజమాని, సభ్యుల వివరాలను నమోదు చేయడంతో పాటు కుటుంబంలోని ప్రతిఒక్కరి ఫోన్‌ నంబరు, వారుచేసే వృత్తి, ఉద్యోగ వివరాలను తీసుకుంటున్నారు.

కుటుంబంలో ఎవరైనా విదేశాలకు లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్తే ఏ కారణంతో వెళ్లారనేది కూడా చెప్పాలి. ఉన్నత చదువు లేదా ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి లేదా ఇతర అవసరాలకు వెళ్లారా.. అని కుటుంబ యజమానిని గణకులు అడుగుతున్నారు. విదేశాల్లో యూకే, అమెరికా, గల్ఫ్, ఆస్ట్రేలియా, కెనడాలతో పాటు ఐరోపా దేశాలకు వెళ్లినట్లు చెబితే ఒక్కో దేశానికి ఒక ప్రత్యేక కోడ్‌ నమోదు చేస్తున్నారు. మరే దేశానికి వెళ్లినా ఇతర దేశం అనే కోడ్‌ నమోదు చేస్తున్నారు. తెలంగాణ నుంచి ఎందరు వలస వెళ్లారు.. ఏ కారణంతో బయటకు వెళ్లారనే సమగ్ర సమాచారం సేకరించడానికి ఈ ప్రశ్నలు రూపొందించారు.

ఇంటింటి సర్వేకు ప్రజలు సహకరించాలి: మంత్రి శ్రీధర్‌బాబు
రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో సమగ్ర కుటుంబ సర్వేను మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. విద్య, ఉపాధి, సామాజిక, రాజకీయ ఆర్థిక ప్రణాళికల కోసం సర్వే చేపట్టినట్లు తెలిపారు. రేషన్‌కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు పోతాయని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. దీని వల్ల ఎలాంటి కార్డులు పోవని స్పష్టం చేశారు. ఇంటింటి సర్వేకు ప్రజలందరూ సహకరించాలని శ్రీధర్‌బాబు కోరారు.

- Advertisement -

సర్వే సమయంలో ఎలాంటి పత్రాలు స్వీకరించరు: మంత్రి పొన్నం
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సామాజిక , ఆర్థిక, ఉపాధి, రాజకీయ కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ను మంత్రి పొన్నం లాంచ‌నంగా ప్రారంభించారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రశ్నపత్రాలను విడుదల చేశారు. అలాగే ఎన్యుమరెటర్ లకి ఇంటింటి కుటుంబ సర్వే కిట్ లను అంద‌జేశారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ, ప్రభుత్వం ఇంటింటి సర్వే పేరుతో మహత్తర కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. ప్రజల సహకారం ఉంటే కార్యక్రమాలు విజయవంతమవుతాయని చెప్పారు. ప్రజలు స్వచ్ఛందంగా సమాచారం ఇచ్చి సహకరించాల్ననారు. అందరి సలహాల మేరకు ప్రశ్నలు రూపొందించినట్లు పేర్కొన్నారు. ఇంటింటి సర్వేతో రాష్ట్రం రోల్‌మోడల్‌గా మారబోతుందని చెప్పారు. సర్వే సమయంలో ఎలాంటి పత్రాలు స్వీకరించరన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement