హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : తెలంగాణలో మరోసారి సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహంచేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల మొదటి వారంలో మొదలు పెట్టే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. పథకాల అమలు మరింత పారదర్శకంగా అమలు చేసే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతానికి భిన్నంగా సమగ్ర సర్వేలో 32 రకాల సమాచారం సేకరించి ప్రతి కుటుంబం యొక్క సూక్ష్మ పరిశీలనకు రేవంత్ సర్కారు సూచనప్రాయ నిర్ణయం తీసుకుంది.
గ్యారెంటీల అమలు కోసం దరఖాస్తుల స్వీకరణ అనంతరం.. ఈ ప్రక్రియను మొదలు పెట్టనున్నారు. సర్వే అంశాల ఆధారంగా లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. 2024 నూతన సంవత్సరం మొదలుకుని రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలు అందజేయనున్నారు. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు 5 గ్యారంటీల అమలు కోసం దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ దరఖాస్తుల సమయంలోనే సమగ్ర కుటుంబ తరహా సర్వేను నిర్వహించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.
ఈ సర్వే ద్వారా ఒక్కో కుటుంబం వివరాలను ప్రభుత్వం సేకరించనుంది. ప్రతీ కుటుంబానికి ఉన్న భూములు, ఇళ్లు, ఉద్యోగం, వ్యాపారం, ఆదాయం, వాహనాలు, గ్యాస్ కనెక్షన్లు తదితర వివరాలతో పాటు రేషన్ కార్డు వివరాలను అధికారులు సేకరించనున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. 2014 ఆగస్టు 19న ఒకేరోజు సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించింది. అయితే.. ఆ సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం వెల్లడించలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండానే పంటల బీమా పథకాన్ని అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ పంట బీమా పథకాన్ని రైతు యూనిట్‌గా అమలు చేసేందుకు వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోందని, సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చాక పంటల బీమా పథకంపై ఒక నిర్ణయానికి వస్తామని సీఎం కార్యాలయ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అధికార పార్టీ కాంగ్రెస్ అమలుకు శ్రీకారం చుట్టిన ఆరు గ్యారెంటీలతో పాటు మిగతా హామీలన్నీ అమలు చేసేందుకు ఈ సర్వే అత్యంత కీలకమని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.